ప్రభుత్వానికి చేరిన ఫైల్
కొన్ని కాలేజీలకు కోత... మరికొన్నింటికి పెంపు
ర్యాంకులు, మౌలిక వసతుల ఆధారంగానే ఫీజులు
వచ్చే వారం జీవో వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంజనీరింగ్ ఫీజులపై స్పష్టత వచ్చింది. కాలేజీల వారీగా ఫీజులు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) ప్రభుత్వానికి ఫైల్ పంపింది. ప్రభుత్వం దీన్ని పరిశీలించి, ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత అధికారికంగా జీవో వెలువడే వీలుంది. వచ్చే వారం ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2025–26 నుంచి మూడేళ్లకు ఈ ఫీజులు వర్తించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తయ్యాయి. ప్రవేశాల సమయంలో పాత ఫీజులే వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో పెరిగిన ఫీజులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేనిపక్షంలో విద్యార్థులు గందరగోళానికి గురవుతారని అధికారులు అంటున్నారు. ఎఫ్‌ఆర్‌సీ ప్రతీ మూడేళ్లకోసారి ఫీజులను సమీక్షిస్తుంది. యాజమాన్యాలు ఇచ్చే ఆడిట్ నివేదికల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తుంది. వాస్తవానికి 2025 ఆరంభం నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. ఫీజుల పెంపుపై ఎఫ్‌ఆర్‌సీ గతంలోనే నివేదిక ఇచ్చినా.. ప్రభుత్వం ఆమోదించలేదు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ తర్వాత మరోసారి యాజమాన్యాలతో ఎఫ్‌ఆర్‌సీ చర్చలు జరిపి, ఫీజులను నిర్ణయించింది.
పెంపు.. కుదింపు
జాతీయ ర్యాంకులు, మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ వంటి అంశాలను ఫీజుల పెంపునకు ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలను ఒక కేటగిరీగా, లేనివాటిని మరో కేటగిరీగా, సాధారణ వసతులు, ఫ్యాకల్టీ ఆశించిన మేర లేని కాలేజీలను మూడో కేటగిరీ కిందకు తెచ్చినట్టు తెలిసింది. మొదటి కేటగిరీకి ఆడిట్ రిపోర్టుల ప్రకారం ఫీజులు పెంచే వీలుంది. రెండో కేటగిరీలో అత్యధికంగా ఉన్న కాలేజీల ఫీజులు కొంత తగ్గించినట్టు తెలుస్తోంది. మూడో కేటగిరీలో గ్రామీణ, జిల్లా కేంద్రాల్లో ఉన్న కాలేజీల పట్ల కొంత ఊరట ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఫీజులు సాధారణ స్థాయిలో పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.


