మోటార్‌ వైరే మంట పెట్టింది!

Clarification on Bazarghat fire Accident - Sakshi

బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై స్పష్టత 

ఉదయం 8.45 గంటలకు షార్ట్‌ సర్క్యూట్‌ 

ఆర్పడానికి ప్రయత్నించిన వాచ్‌మెన్‌ దంపతులు 

రసాయనాలు ఉండటంతో మంటలు 

సాక్షి, హైదరాబాద్‌: వాటర్‌ మోటార్‌ వైరులో ఏర్పడిన షాట్‌సర్క్యూట్‌ కారణంగానే బజార్‌ఘాట్‌లోని బాలాజీ రెసిడెన్సీలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రా థమికంగా నిర్థారించారు. ఉదంతం చోటు చేసుకున్న భవ నం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను విశ్లేషించిన నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చారు. సోమ వారం జరిగిన ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృతిచెందిన విషయం విదితమే. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని మొదట్లోనే భావించినా... ఎప్పుడు? ఎక్కడ నుంచి జరిగిందనేది తాజాగా క్లూస్‌ టీమ్‌ అధికారులు గుర్తించారు.  

కేసింగ్‌ దెబ్బతిని వైర్లు బయటకు... 
ఈ అపార్ట్‌మెంట్‌ను జీ+4 విధానంలో నిర్మించారు. మధ్యలో లిఫ్ట్, మెట్లు ఉండగా... వీటికి కుడి వైపున నాలుగు, ఎడమ వైపున నాలుగు చొప్పున ఫ్లాట్స్‌ ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వాచ్‌మెన్‌ గదితో పాటు యజమాని రమేష్‌ జైశ్వాల్‌కు సంబంధించిన అక్రమ గోదాములు ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కుడి వైపు వాచ్‌మెన్‌ రూమ్‌ పక్కన పాలిమర్‌ షీట్లు నిల్వ ఉంచగా.. ఎడమ వైపు రసాయనాల డబ్బాలు ఉంచారు.

దీనికి సమీపంలోనే కొన్ని కార్టన్‌ బాక్సుల్నీ నిల్వ చేశారు. వీటి వెనుక ఉన్న గోడకు స్టార్టర్‌ నుంచి మీటర్‌ వరకు వెళ్ళిన వైరు కేసింగ్‌తో ఉంది. కార్టన్‌ బాక్సుల్ని పదేపదే కదిపిన కారణంగా కేసింగ్‌ దెబ్బతినడంతో వైర్లు బయటకు వచ్చి ఉంటాయని, ఇవి రాపిడికి గురికావడంతో పైన ఉండే పొర దెబ్బతిని లోహపు వైరు బయటకు వచ్చి ఉంటుందని క్లూస్‌ టీమ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.  

మోటార్‌ ఆన్‌ చేసిన కొన్ని నిమిషాలకే... 
అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ భార్య సోమవారం ఉదయం 8.15 గంటలకు మోటార్‌ ఆన్‌ చేశారు. దాదాపు అర్ధగంట తర్వాత 8.45 నిమిషాల ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయడం మానేశాయి. దీన్ని బట్టి అప్పుడే షార్ట్‌ సర్క్యూట్‌ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాచ్‌మెన్‌ దంపతులను ప్రశ్నించిన పోలీసులు మరికొన్ని వివరాలు సేకరించారు. షార్ట్‌సర్క్యూట్‌ ప్రభావంతో వచ్చిన నిప్పురవ్వల కారణంగా కార్టన్‌ బాక్సులకు నిప్పు అంటుకుంది.

గమనించిన వాచ్‌మెన్‌ దంపతులు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ లోపే ఆ బాక్సుల్లో ఉన్న మెటీరియల్‌ అంటుకుని మంటలు విస్తరించడం మొదలయ్యాయి. వాచ్‌మెన్‌ కాలికి గాయం కావడంతో వేగంగా స్పందించలేకపోయాడు. దాంతో మంటలు రసాయనాలకు అంటుకోవడంతో ఊహించని నష్టం జరిగిపోయింది. ఉస్మానియా ఆస్పత్రిలోని బర్న్స్‌ వార్డులో చికిత్స పొందుతున్న మరో బాధితుడు తల్హా (17) పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top