పాపకు ప్రాణమున్నా పోయిందన్నారు.. చివరి నిమిషంలో ట్విస్ట్‌

Child Saved At Last Minute Due To Hospital Negligence - Sakshi

జగిత్యాల: ఐదు రోజుల శిశువు. అనారోగ్యంతో ఆస్పత్రిలోనే ఉంది. కాపాడుకోవడానికి రూ.లక్ష కుమ్మరించారు తల్లిదండ్రులు. అయినా ‘పాప ప్రాణం పోయింది.. తీసుకెళ్లండి’ అన్నారు డాక్టర్లు. దీంతో ఆశలొదులుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ప్రేమ ఆ పసిగుడ్డు గుండెను కరిగించిందేమో.. శ్మశానంలో ఉండగా కదలికలొచ్చాయి. ప్రాణంతోనే ఉందని గుర్తించి, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వేణుకు సంగీతతో వివాహం జరిగింది. ప్రసవానికి సంగీత తల్లి ఊరైన కోరుట్లకు వెళ్లింది.  అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏప్రిల్‌ 27న పాపకు జన్మనిచ్చింది. పాప ఉమ్మ నీరు తాగిందని, ఆరోగ్య సమస్యలున్నాయని అక్కడే చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో... కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

రూ. లక్ష వరకు ఫీజు వేసిన ఆస్పత్రి, పాప బతికే పరిస్థితి లేదని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించింది. పాపలో చలనం లేకపోవడంతో చనిపోయిందని భావించి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ పాప కదలడం గుర్తించిన తల్లిదండ్రులు.. వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో సంగీత–వేణు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top