Chikkadpally To China! - Sakshi
Sakshi News home page

చిక్కడపల్లి టు చైనా! 

Published Sun, Jul 23 2023 3:19 AM

Chikkadapally to China! - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి రూ.28 లక్షలు మోసపోయిన ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్‌ కేసు తీగలాగిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దుబాయ్‌ మీదుగా చైనాలో ఉన్న డొంక కదిపారు. ఈ కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన నలుగురు హైదరాబాదీయులు సైబర్‌ నేరాల్లో కొత్త కోణాన్ని బయటపెట్టారు. ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడిన కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులకు రివార్డులు అందించారు.

  • చిక్కడపల్లి వాసి శివకుమార్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్‌లో రూ.28 లక్షలు కోల్పోయి మార్చిలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ బాధితుడి నగదు ఆరు బ్యాంకు ఖాతాల్లోకి, వాటి నుంచి మరో 48 అకౌంట్లలోకి వెళ్లినట్లు గుర్తించారు. వీటి విషయం జాతీయ స్థాయిలోని సైబర్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్‌కు అందించగా...వాటిలో దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి మరో రూ.584 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సమాధానం వచ్చింది.  
  • ఆ బ్యాంకు ఖాతాల్లో రాధిక మర్చంట్స్‌ పేరుతో ఉన్న షెల్‌ కంపెనీది కూడా ఉంది. ఈ అకౌంట్‌తో లింకై ఉన్న సెల్‌ నెంబర్‌ నగరానికి చెందిన మునావర్‌ వాడుతున్నట్లు తెలియడంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనతో పాటు నగర వాసులైన ఆరుల్‌ దాస్, సమీర్‌ ఖాన్, ఎస్‌.సుమేర్‌లను వికాస్, మనీష్‌, రాజేష్‌లు లక్నో పిలింపించారని బయటపెట్టాడు. వీరి ముంబై హవాలా నెట్‌వర్క్‌లో భాగమైన నయీమ్‌... సమీర్‌కు బంధువు కావడంతో పరిచయాలు ఏర్పడ్డాయి.  
  • మూడు నెలలు లక్నోలో ఉన్న నలుగురు నగర వాసులూ నకిలీ గుర్తింపు కార్డులతో 33 షెల్‌ కంపెనీలు, 65 బ్యాంకు ఖాతాలు తెరిచి వారికి అప్పగించి వచ్చారని తేలింది. వీళ్ళకు ఒక్కో ఖాతాకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టిందని బయటపెట్టారు. వీరందించిన ఖాతాల్లో మరో రూ.128 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా మొత్తం రూ.713 కోట్లు ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్‌లో దేశం దాటేశాయని అధికారులు తేల్చారు. నగరం, ముంబైల్లో ఉన్న వారిని పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాష్‌, కుమార్‌ వ్యవహారాలు తెలిశాయి. 
  • కీలకమైన ప్రకాష్‌ అనునిత్యం దుబాయ్, చైనాలకు వెళ్లి వస్తున్నాడని గుర్తించారు. జూన్‌ 30న చైనా నుంచి వచ్చిన ఇతగాడు తన నెట్‌వర్క్‌లోని ఓ వ్యక్తితో వాట్సాప్‌ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇతడి నెంబర్‌ తెలుసుకున్న అధికారులు వాట్సాప్‌ యాక్టివేట్‌ అయిన నెట్‌వర్క్‌ గుర్తించారు. దీనికి లింకైన నెంబర్‌ లోకేషన్‌ ఆధారంగా ప్రకాష్‌ ముంబైలో ఉన్నట్లు పసిగట్టారు. హాలిడే కోసం అక్కడకు వెళ్ళిన ఇతడితో పాటు కుమార్‌ను పట్టుకుని సిటీకి తీసుకువచ్చారు. వీరి నుంచి భారీగా ల్యాప్‌టాప్స్, ఫోన్లు, షెల్‌ కంపెనీల లెటర్‌ హెడ్స్‌ కూడా స్వాదీనం చేసుకున్నారు. కాగా ఇలాంటి నేరగాళ్లు, నేరాలపై రిజర్వుబ్యాంకు, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్, జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం ఇస్తామని సీపీ సీవీ ఆనంద్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement