హైదరాబాద్: చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్న ఓ విద్యార్థి నాలుక కోసుకొని..ఆపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్‌పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ క్రిష్ణ తెలిపిన మేరకు.. ఏపీలోని కర్నూలు జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన జనార్ధన్ (28) చెన్నైలో సీఏ ఫైనలియర్ చదువుతున్నాడు.
పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నగరానికి వచ్చి మియాపూర్‌లోని స్నేహితులతో ఉంటున్నాడు. గురువారం ఉదయం స్నేహితులు విధులకు వెళ్లగా జనార్ధన్ ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి స్నేహితులు గదికి వచ్చి చూడగా జనార్ధన్ ఫ్యాన్‌కు లుంగీతో ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. గదిలో సూసైడ్ నోట్ లభించింది.
అమ్మ..నాన్నా. మీరు అనుకున్నట్లు నేను చదువులేక పోతున్నా.. సీఏ కోర్సు చదవడం నా వల్ల కావడం లేదు.. తనను క్షమించాలని లేఖలో పేర్కొన్నాడు. మొదట మొదట నాలుక కోసుకొని ఆ తరువాత ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో మొత్తం రక్తపు మరకలు ఉండడంతో మృతుడి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఉన్న ఒక్కగొనక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


