ఉచిత రేషన్‌కు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

Centre To Roll Out Free Ration Distribution From 5th Jan 2023 - Sakshi

ఈనెల 5 నుంచి రేషన్‌ పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజనలో భాగంగా కేంద్రం ప్రకటించిన సంవత్సర కాలం ఉచితరేషన్‌ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ జనవరి నుంచి వచ్చే డిసెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా 5 కిలోలు బియ్యం ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.  జాతీయ ఆహార భద్రతా చట్టం కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు.

అంత్యోదయ కార్డులకు కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోలు ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా కుమ్రంబీమ్, ఆసిఫా బాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్‌ జిల్లాలకు బియ్యానికి బదులుగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులున్న వారి విషయంలో ఉచిత రేషన్‌ గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో 90 లక్షల ఆహార భద్రత కార్డులుండగా, అందులో 55 లక్షల కార్డులు కేంద్ర పరిధిలో ఉండగా, 35 లక్షల కార్డులు రాష్ట్ర పరిధిలో ఉన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top