ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కుట్ర.. క్విడ్‌ ప్రోకో! | Sakshi
Sakshi News home page

Delhi Liquor scam: కుట్ర.. క్విడ్‌ ప్రోకో!

Published Mon, Sep 19 2022 2:15 AM

CBI Focus On Conspiracy Quid Pro Quo Issues In Delhi Liquor Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుట్ర, క్విడ్‌ ప్రోకో.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈ రెండు అంశాలపైనే సీబీఐ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎక్సైజ్‌ పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించి వ్యాపారులకు మేలు చేశారని ఆరోపిస్తున్న సీబీఐ, ఇందులో కుట్ర కోణంతో పాటు క్విడ్‌ ప్రో కో ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మరోవైపు నిందితులుగా ఆరోపణలెదుర్కొంటున్న వారితో పాటు బినామీ కంపెనీలు సృష్టించి లిక్కర్‌ టెండర్లు దక్కేలా సిండికేట్‌ వ్యవహారం సాగించిన చీకటి వ్యక్తులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బయటపెట్టే దిశగా సీబీఐ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చిన ఢిల్లీ సీబీఐ, ఆ జాబితాలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లై నివాసంలో గత నెలలో సోదాలు నిర్వహించింది. సీబీఐ దాడుల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు రెండు సార్లు సోదాలు నిర్వహించారు. పిళ్‌లైతో పాటు ఆయన సంస్థ రాబిన్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్‌ బోయినిపల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్, ఆడిటర్‌ బుచ్చిబాబు, మరో 25 మంది నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాల్లో లభించిన కీలక ఆధారాలతో ప్రముఖులకు లిక్కర్‌ స్కామ్‌ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది.

వెలుగులోకి సంచలనాత్మక విషయాలు...
    రెండు దర్యాప్తు సంస్థల విచారణలో బినామీ కంపెనీల గుర్తింపు, ఆ కంపెనీల టెండర్లు, లంచాలకు ఇచ్చిన నగదు.. ఇలా అనేక సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుట్ర పూరితంగానే ఈ విధంగా వ్యవహరించి కంపెనీలకు లాభం చేర్చేలా చేశారని, అదేవిధంగా భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్టు సీబీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బినామీ కంపెనీలను సృష్టించడంతో పాటు సిండికేట్‌ రూపంలో తమ వారికి దక్కేలా చేసిన చీకటి నేతలు, ప్రముఖ వ్యక్తులపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

రెండు దఫాలుగా నోటీసులు..
    అరుణ్‌ రామచంద్ర పిళ్‌లైతో పాటు ఆయన కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్‌సాగర్, ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన ఆడిటర్‌ బుచ్చిబాబును మొదటి దఫాలో విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు విశ్వసీనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే విచారణ ఇక్కడ చేస్తారా లేకా ఢిల్లీలో చేస్తారా అన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. వీరితో పాటు రెండో దఫాలో ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీతో పాటు ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన 16 కంపెనీలు, వాటిలోని డైరెక్టర్లు 8మందికి నోటీసులిస్తారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఎక్సైజ్‌ స్కామ్‌లో ఆరోపణలెదుర్కొంటున్న సిండికేట్‌లోని ఇద్దరు వ్యాపారులు తాము ఈ టెండర్ల వ్యవహారంలో రూ.250 కోట్లకు పైగా నష్టపోయినట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. భారీ నష్టంతో పాటు సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడం ఇబ్బందికరంగా మారిందని ఓ ప్రముఖ నేత వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఎన్‌ఐఏ పంజా.. నిజామాబాద్‌ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్‌

Advertisement
 
Advertisement
 
Advertisement