కరోనా చికిత్సలో ఈ మెడిసిన్‌ వాడేటప్పుడు జాగ్రత్త..!

Caution When Using This Medicine In Corona Treatment - Sakshi

మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్సపై ఏఐజీ ఆస్పత్రుల  చైర్మన్‌ డా.డి.నాగేశ్వర్‌రెడ్డి  

కరోనా చికిత్సలో అత్యవసరమైతే తప్ప వినియోగించొద్దు 

దుష్ప్రభావాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ చికిత్సలో బ్రహ్మాస్త్రం లాంటి మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ మందును అవసరమున్న వారికే ఉపయోగించాలి తప్ప విచక్షణరహితంగా వాడొద్దని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డా.డి.నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఖరీదైన మందు (దాదాపు రూ.70 వేలు) కావడంతో పాటు దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. అవసరం లేకపోయినా దీన్ని ఉపయోగిస్తే వైరస్‌ మ్యూటెంట్లు మరింత ముదిరే అవకాశం ఉందని, యాంటీబాడీ చికిత్సకు కూడా లొంగని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చాక మూడు రోజుల్లో లేదా వారంలోనే దీన్ని తీసుకోవాలని, ఆ తర్వాత దీని ప్రభావం ఉండదని చెప్పారు. తమ ఆస్పత్రిలో ‘కసిరివిమాబ్, ఇమ్దెవిమాబ్‌ కాంబినేషన్‌లోని యాంటీబాడీస్‌ మందు వేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గురువారం జూమ్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. కోవిడ్‌ తొలిదశలో స్వల్ప, ఒక మోస్తరు లక్షణాలు ఉన్న వారిపైనే ఇది పనిచేస్తుందని, అయితే ఇది ఇచ్చాక త్వరగా కోలుకుంటారని చెప్పారు. 

ఇంజెక్షన్‌ రూపంలో.. 
ప్రస్తుతం మన దగ్గర ఇంజెక్షన్‌ రూపంలో దీనిని ఇస్తున్నట్టు చెప్పారు. ఈ మందు తీసుకున్నాక ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం తగ్గిపోవడమే కాకుండా 70 శాతం వరకు మరణించే అవకాశాలు తగ్గి వైరల్‌ క్లియరెన్స్‌లోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ప్రస్తుతం అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు.

అయితే ఇండియాలో డబుల్‌ మ్యుటెంట్‌పై ఇది ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్న దానికి సంబంధించి వంద మందిపై నిర్వహిస్తున్న పరిశోధన ఫలితాలు నెలలో వెల్లడి అవుతాయని చెప్పారు. ఈ మందు తీసుకున్న వారికి కనీసం 3 నెలల ద్వారా వ్యాక్సిన్‌ వేయకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో తయారవుతున్న ఈ మందును సిప్లా కంపెనీ ద్వారా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. దీని ఫలితాల ఆధారంగా త్వరలోనే దేశీయంగా ఉత్పత్తి చేసే అవకాశముందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు కనీస బరువు 40 కిలోలు ఉన్న వారికి ఈ చికిత్సకు అనుమతిస్తారు. 

ఎవరెవరికి ఇవ్వొచ్చు.. 

  • 65 ఏళ్లు పైబడిన వారు. 
  • అనియంత్రిత మధుమేహం ఉన్న స్థూలకాయులు గుండెజబ్బులున్న వారు. 
  • ఇమ్యునో సప్రెషన్స్‌ తీసుకునే కేన్సర్, ఇతర జబ్బుల వారు. 
  • 55 ఏళ్లకు పైగా వయసున్న వారిలో అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top