భూం..ధాం..డీటీసీపీలో భూముల ధరలెక్కువ

Builders Interested Venturing HMDA Areas Rather Than Nearest DTCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌ వేసేందుకు స్థలాన్ని చూశాడు. భూ యజమానితో ఎకరాకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. సరిగా నెల తర్వాత 8 కి.మీ. దూరంలో ఉన్న కడ్తాల్‌లో ఎకరా రూ.4 కోట్ల చొప్పున లే అవుట్‌ ప్రారంభించాడు. అందేంటి? హెచ్‌ఎండీఏ పరిధిలో, హైవేకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని.. ఎక్కువ ధర పెట్టి డీటీసీపీలో వెంచర్‌ వేశారేంటని ప్రశ్నించగా.. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇండస్ట్రియల్, కన్జర్వేషన్‌ జోన్ల కారణంగా నివాసిత స్థలం తక్కువగా ఉంది.

పైగా లే–అవుట్‌ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాలి. ఫీజులూ ఎక్కువే. అదే డీటీసీపీ ఫ్రీ జోన్‌. చార్జీలు తక్కువే, పర్మిషన్లూ సులువుగా వచ్చేస్తాయని సమాధానమిచ్చాడు. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాట్లూ త్వరగానే అమ్మకం జరుగుతాయని సెలవిచ్చాడు. 

.. ఇది ఆ ఒక్క డెవలపర్‌ అభిప్రాయమే కాదు. చాలా మంది బిల్డర్లు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రాంతాలలో కాకుండా దగ్గరగా ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) పరిధిలో వెంచర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెచ్‌ఎండీఏలో కంటే డీటీసీపీ ప్రాంతాల్లోని భూముల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. 

ఆంక్షల్లేవ్‌.. ఆకాశంలో ధరలు 
హెచ్‌ఎండీఏ పరిధిలో చాలా వరకు ప్రాంతాలు ఇండస్ట్రియల్, కన్జర్వేషన్‌ జోన్లలో ఉంటాయి. ఇక్కడ ప్లాంటింగ్‌ లేదా నివాస భవనాలకు అనుమతి లేదు కేవలం పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. లే– అవుట్, నిర్మాణాలకు పనికొచ్చే రెసిడెన్షియల్‌ (ఆర్‌)–1 జోన్‌ స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. డీటీసీపీలో జోన్ల సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ భూముల ధరలు హెచ్‌ఎండీఏతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పలుకుతున్నాయని స్పేస్‌ విజన్‌ సీఎండీ నర్సింహారెడ్డి తెలిపారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో ఫీజు చదరపు మీటరుకు రూ.40 చెల్లించాలి. బెటర్‌మెంట్‌ చార్జీలు, పార్క్‌లు, ఇతరత్రా లోడ్ల పేరిట ఫీజుల మోత మోగుతుంది. పైగా అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాలి. డీటీసీపీలో గ్రామ పంచాయితీ తీర్మానాన్ని బట్టి ఫీజుల్లో తేడా ఉంటుంది. బెటర్‌మెంట్‌ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, లే అవుట్‌ ఫీజు (చ.మీ.) గజానికి రూ.5–12 వరకు ఉంటుంది.  

డీటీసీపీలో రోడ్ల విస్తీర్ణం ఎక్కువే.. 
లే–అవుట్‌ విస్తీర్ణంలో 10 శాతం ఓపెన్‌ ప్లేస్, 30 శాతం రోడ్లకు పోగా మిగిలిన స్థలంలో ప్లాటింగ్‌ చేసుకోవచ్చు. రహదారుల హద్దులను బట్టి ఎకరం స్థలంలో 55–59 శాతం ప్లాటింగ్‌ ఏరియా ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 2,600 గజాల నుంచి 2,900 గజాల ప్లాటింగ్‌ చేసుకోవచ్చు. హెచ్‌ఎండీఏలో పోలిస్తే డీటీసీపీలో రహదారుల విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉంటుంది. హెచ్‌ఎండీఏలో 30 అడుగుల రోడ్లు ఉన్నా అనుమతులు వస్తాయి. అదే డీటీసీపీలో అయితే అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాల్సిందే. ఒకవేళ హెచ్‌ఎండీఏ పరిధిలో అప్రోచ్‌ రోడ్‌ 40 ఫీట్లు ఉంటే ఇంటర్నల్‌ రోడ్‌ కూడా 40 ఫీట్లు ఉండాల్సిందే. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ ఏ ప్రాంతంలోనైనా సరే లే–అవుట్‌లోని మొత్తం ప్లాటింగ్‌ 15 శాతం మార్టిగేజ్‌ చేయాల్సి ఉంటుంది. 

అమ్మకాలు సులువు.. 
అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలతో పోలిస్తే ఓపెన్‌ ప్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ధరే కొనుగోలు నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే చాలా మంది డెవలపర్లు హెచ్‌ఎండీఏ పరిధిలో అధిక ధర పెట్టి స్థలాన్ని కొని వెంచర్‌ చేస్తే డెవలపర్‌కు పెద్దగా లాభం ఉండదు. అదే హెచ్‌ఎండీఏ ప్రాంతం నుంచి 4–5 కి.మీ. దూరంలో ఉన్న డీటీసీపీలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లను చేస్తే సులువుగా అమ్ముడవుతాయి. డెవలపర్‌కూ గిట్టుబాటవుతుంది. ప్రతికూల మార్కెట్‌ ఉన్న ప్రస్తుత సమయంలో డీటీసీపీలో వెంచర్లు చేయడమే ఉత్తమమని మిర్చి డెవ లపర్స్‌ ఎండీ మల్లారెడ్డి అన్నారు.  

(చదవండి: 4 గంటలు.. 3 సర్జరీలు)

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top