దానం చేతిలో రూ. 1.50 లక్షలు మాత్రమే!

BRS MLA Danam Nagender Reddy File Nomination At Khairatabad - Sakshi

బంజారాహిల్స్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేయగా అఫిడవిట్‌లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్‌ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. 

కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్‌పీ. ఇండెన్‌ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. 

తనకు వరంగల్‌ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.  

ఆభరణాల విలువ రూ. 27కోట్లు  
దానం నాగేందర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట  1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top