22న ఢిల్లీకి కేసీఆర్‌?

BRS Leader KCR Tour To Delhi On Feb 22 2024 - Sakshi

బీజేపీతో పొత్తు వార్తల నేపథ్యంలో దేశ రాజధాని పర్యటనపై ఆసక్తి 

లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో బీఆర్‌ఎస్‌ అధినేత బిజీబిజీ 

విపక్షాల అభ్యర్థులు ఖరారైన తర్వాతే పార్టీ జాబితా 

విడుదల చేయాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 22న ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్‌ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూలుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు కుదుర్చుకుంటుందనే వార్తల నేపథ్యంలో కేసీఆర్‌ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. 

పొత్తు లేదని ఇరు పార్టీలూ చెబుతున్నా.. 
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుకు అవకాశం లేదని అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు తెగేసి చెప్తున్నా.. ఆ వాదనలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో పార్టీ ఎంపీలతో పాటు కొందరు కీలక నేతలు కూడా ఉంటారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో కాకుండా లోక్‌సభ షెడ్యూలు విడుదల తర్వాతే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచా­రం. అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడంతో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాతే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. 

త్వరలో కీలక నేతలతో భేటీ.. 
విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు బుధవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు మరో వారం పది రోజుల్లో వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ సమీక్ష, సన్నద్ధత సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఎన్నికలకు సంబంధించి తదుపరి కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ సమావేశమవుతారు.    

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top