జూరాలపై బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ | Bridge cum barrage on the Krishna River upstream of the Jurala Project | Sakshi
Sakshi News home page

జూరాలపై బ్రిడ్జి కమ్‌ బరాజ్‌

Apr 6 2026 4:12 AM | Updated on Apr 6 2026 4:11 AM

Bridge cum barrage on the Krishna River upstream of the Jurala Project

స్థలాన్ని ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశం 

నీటిపారుదల శాఖపై సమీక్షలో కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: జూరాల ప్రాజెక్టుకు ఎగువన కృష్ణానదిపై బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ను నిర్మించే ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఉత్తమ్‌ ఆదేశించారు. జూరాల ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. 

ప్రాజెక్టులో 1.66 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నారాయణపూర్‌ జలాశయం నుంచి 0.5 టీఎంసీల ఊట నీరు వచ్చే అవకాశముందని అధికారులు వివరించారు. సకాలంలో ఈ నీరు రాకుంటే తాగునీటి అవసరాలకు 0.5 టీఎంసీల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. గతేడాది కర్ణాటక నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చివరిదశలో ఉన్న ఆయకట్టు పంటలకు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. 

పంటల సాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రణాళికాబద్ధంగా నీటిని సమర్థ రీతిలో వినియోగించాలని, ఈ బాధ్యత ఆయా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు స్వయంగా తీసుకోవాలని చెప్పారు. ఆయకట్టు పంటలతోపాటు జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను తాగునీటి అవసరాలకు రక్షించాలని ఆదేశించారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద 6.3 లక్షల ఎకరాల పంటల సాగు దాదాపుగా ముగిసిందని, అవసరమైన చోట సాగునీటి సరఫరా చేయాలని సూచించారు. ప్రస్తుత సీజన్‌లో కాల్వలకు నీటి సరఫరాను నిలుపుదల చేయడానికి ముందే తాగునీటి అవసరాలకు చెరువులను నింపుకోవాలని ఆదేశించారు.  

అన్ని ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు  
రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, చెరువుల్లో పూడిక తొలగింపునకు సాధ్యాసాధ్యాలతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. పూడిక మట్టిని తరలించడానికి మార్గమున్న ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా తీసుకెళ్లి పంట పొలాల్లో ఎరువుగా వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. మార్గం లేని ప్రాజెక్టుల నుంచి శాఖ ఆధ్వర్యంలో పూడిక తొలగింపు కోసం రెండు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. 

పూడికతో జలాశయాల నిల్వ సామర్థ్యం 30–40శాతం తగ్గిపోయిందని సర్వేలు పేర్కొంటున్నాయని గుర్తు చేశారు. భారీ పంప్‌హౌస్‌లకు సంబంధించిన పంపులను మాటిమాటికి ఆన్‌ ఆఫ్‌ చేస్తే చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను సత్వరమే సిద్ధం చేయాలన్నారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, సొరంగాల నిపుణులు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, సలహాదారులు ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్సీ (జనరల్‌) రమేశ్‌బాబు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement