
సాక్షి, మేడ్చల్: పాశమైలారం ప్రమాదం మరవకముందే మేడ్చల్- మల్కాజిగిరిలో మరో ప్రమాదం జరిగింది. మేడ్చల్ పారిశ్రామికవాడలో ఆల్కలైడ్స్ కంపెనీలో బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో గన్నారం శ్రీనివాస్‌రెడ్డి అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది.
శ్రీనివాస్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, రాష్ట్రంలో పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. పారిశ్రామిక ప్రమాదాలు కార్మికుల ప్రాణాలు, వారి జీవన స్థితిగతులతోపాటు పరిశ్రమల భవిష్యత్తు, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపే రీతిలో ఉంటున్నాయి. రసాయన, ఔషధ, టెక్స్‌టైల్, ఆహార సంబంధిత పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కు వగా చోటుచేసుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం కేంద్రీకృతమై ఉన్న హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏటా ప్రమాదాలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్ పరిసరాల్లోని జీడిమెట్ల, జిన్నారం, గడ్డపోతారం, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, పటాన్‌చెరు, సంగారెడ్డి తదితర పారిశ్రామిక వాడల్లో తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఔషధ తయారీ యూనిట్లు, ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో పేలుళ్లు, రసాయనాల లీకేజీలు, షార్ట్ సర్క్యూ ట్లు, అగ్ని ప్రమాదాలు, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల మూలంగా కార్మీకుల ప్రాణాలు గాల్లో కలుస్తుండగా, భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతోంది.
పారిశ్రామిక రంగంలో ఫార్మాస్యూటికల్స్, కెమికల్ యూని ట్స్‌ను హైరిస్క్ పరిశ్రమలుగా పరిగణిస్తూ ఉంటారు. తెలంగాణలో హైరిస్క్ యూనిట్లు 4,130 వరకు ఉన్నా వాటిలో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో ఇన్‌స్పెక్టర్లు 20 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పరిశ్రమల సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను తరచూ తనిఖీ చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.