కరోనా ఉంది.. శవాన్ని ఇటు తేవొద్దు..!

Body Was Prevented From Entering Village In Peddapalli - Sakshi

ముళ్లపొదలను రోడ్డుపై వేసి 

అడ్డుకున్న కెనాల్‌ కాలనీవాసులు

గుండెపోటుతో చనిపోయాడని నచ్చజెప్పిన పంచాయతీ పాలకులే

సాక్షి, పెద్దపల్లి‌: కరోనా వైరస్ వల్ల చనిపోయాడనే అనుమానంతో అంత్యక్రియలు జరిపేందుకు తమ ఇళ్లకు సమీపంలో ఉండే శ్మశానవాటిక వద్దకు మృతదేహాన్ని తేవొద్దంటూ రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె వేసి అడ్డుకున్న ఘటన పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన అడప గట్టయ్య అనే వ్యక్తి ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో బంధుమిత్రులు కూడా మృతుడి ఇంటివైపు వెళ్లేందుకు సాహసించలేదు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్‌ చీకటి స్వరూప, మాజీ ఉపసర్పంచ్‌ చీకటి పోచాలు మృతికి గుండెపోటు కారణమని నిర్ధారించుకుని అక్కడికి చేరుకున్నారు. (కరోనా మిగిల్చిన విషాదం..!)

కరోనా వైరస్‌ వల్లే చనిపోతే శవాన్ని పూడ్చివేయించేవారమని, గుండెపోటుతో చనిపోయాడని ఎవరూ ఆందోళన చెందొద్దని నచ్చజెప్పారు. కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఎస్సారెస్పీ కెనాల్‌రోడ్డు కాలనీవాసులు శవాన్ని ఇటువైపు తీసుకురావద్దంటూ ముళ్లకంచెను రోడ్డుకు అడ్డంగా వేశారు. అంత్యక్రియలను నిర్వహించకుండా అడ్డుకోవద్దని, గట్టయ్య గుండెపోటుతోనే మరణించాడని, కరోనా కారణంగా చనిపోతే వైద్యాధికారులు, పోలీసులే శవాన్ని గ్రామంలోకి రానివ్వరంటూ పంచాయతీ పాలకులు నచ్చజెప్పారు. దీంతో ముళ్లకంచెను తొలగించి యథాతథంగా అంత్యక్రియలు నిర్వహించుకున్నారు. (22 గంటలపాటు ఇంట్లోనే మృతదేహం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top