గట్లెట్ల కేటీఆర్‌ను కలుస్తరు; సొంత పార్టీ నేతలపై బీజేపీ సీరియస్

బీజేపీలో ఒకరిద్దరు నేతలపై చర్యలు!
‘లింగోజిగూడ’ ఏకగ్రీవం కోసం కేటీఆర్‌ను కలవడంపై అధిష్టానం సీరియస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్ ఎన్నిక ఏకగ్రీవం విషయమై మాట్లాడేందుకు మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లిన బీజేపీ నేతలపై చర్యలు తప్పేలా లేవు. దీనిని పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంలో నిజనిర్ధారణ చేసి, చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఒక కార్పొరేటర్ స్థానం కోసం హైదరాబాద్ నగర, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు ఎందుకు టీఆర్‌ఎస్ నేతలను కలవాల్సి వచ్చింది.. ఎవరు చెబితే వెళ్లారు.. మంత్రి కేటీఆర్‌ను ఎందుకు కలిశారు.. ఆ సందర్భంగా బండి సంజయ్‌పై కేటీఆర్ కామెంట్స్ చేసినా ఎందుకు ఉపేక్షించారు.. తదితర అంశాలతోపాటు ఆ వ్యవహారం వెను క ఏం జరిగిందనే విషయాన్ని తేల్చాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంతో సంబంధమున్నవారిపైనా చర్యలు చేపట్టే బాధ్యతను కూడా బండి సంజయ్‌కే అప్పగించినట్లు తెలిసింది.
నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు
కేటీఆర్‌ను కలిసిన వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి నేతృత్వంలో సోమవారం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమగ్ర వివరాలను సేకరించి రెండు రోజుల్లో తనకు రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని సంజయ్ ఆదేశించారు. దీంతో కమిటీ వెంటనే రంగంలోకి దిగి వాస్తవాలను నిగ్గు తేల్చే పనిలో పడింది.
చదవండి: మంత్రి ఈటలకు ఏమైంది? మరోసారి ‘అసంతృప్తి’ వ్యాఖ్యలు
చదవండి: మున్సి‘పోరు’.. టీఆర్‌ఎస్ సరికొత్త రాజకీయం