GHMC: రణరంగంగా మారిన మేయర్‌ చాంబర్‌..

BJP Corporators Barge Into GHMC Mayor Chamber Destroys Furniture - Sakshi

సర్వసభ్య సమావేశం ఏర్పాటుకు డిమాండ్‌

మెరుపు ధర్నాకు దిగిన బీజేపీ సభ్యులు

ఫర్నిచర్, పూలకుండీలు ధ్వంసం

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని, కార్పొరేటర్లకు బడ్జెట్‌ కేటాయించాలనే డిమాండ్లతో బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో మేయర్‌ విజయలక్ష్మి కార్యాలయంలోనికి చొచ్చుకుపోవడం రణరంగాన్ని తలపించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది.  మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్‌ చాంబర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ గుంపుగా పోగైన వారు జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ కాసేపు బైఠాయించారు. అక్కడి నుంచి మేయర్‌ చాంబర్‌వైపు వెళ్లారు. కార్పొరేటర్లతో పాటు వారి అనుచరులు దాదాపు రెండొందల మంది వరకు గుంపులుగా చేరడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందుకు దూసుకువెళ్తూ వరండాలోని పూలకుండీలను ధ్వంసం చేశారు.
చదవండి: కుంకుమ పువ్వు సాగుపై కేటీఆర్‌ ప్రశంస 

మేయర్‌ అప్పటికింకా కార్యాలయానికి రాలేదు. ఆమె చాంబర్‌లోకి వెళ్లి ఫర్నిచర్‌ను, ల్యాంపులు, పూలకుండీలను ధ్వంసం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ల నేమ్‌బోర్డులు పీకిపారేశారు. కేబుల్‌వైర్లు తెంపారు. జీహెచ్‌ఎంసీ పేరున్న బోర్డుపై నల్లరంగు పూశారు.  చాంబర్‌లో బైఠాయించారు. మేయర్‌కో హటావో.. జీహెచ్‌ఎంసీ బచావో తదితర నినాదాలతో కూడిన పోస్టర్లను చాంబర్‌లో అంటించారు. మెరుపు ధర్నాతో కాసేపు ఏం జరుగుతోందో అక్కడున్నవారికి అర్థం కాలేదు.  ఈ పరిణామాలతో దాదాపు రెండు గంటల పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
చదవండి: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. వారికి సంతోషమే.. కానీ..


పగిలిపోయిన పూలకుండీలను ఒకచోటకు చేరుస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది 

కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాదవుతున్నా ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదని, కార్పొరేటర్లకు బడ్జెట్‌ కేటాయించలేదని నినాదాలు చేశా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్‌ జులుం నశించాలని నినదించారు. సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్, కేటీఆర్‌ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ఒకసారి నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో తమ వాణి వినిపించలేకపోయామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని, సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు బీజేపీ నేతలు, వారి అనుయాయులను అరెస్టు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top