కష్టాలు కదిలించాయి..  కన్నీళ్లు తెప్పించాయి

BJP Chief Bandi Sanjay In Sakshi Exclusive Interview

పాదయాత్ర సాగిన ప్రాంతాల్లో కోకొల్లలుగా సమస్యలు 

‘సాక్షి’ ఇంటర్వూ్యలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రజల కడగండ్లు కదిలించాయి... కన్నీళ్లు తెప్పించాయి. ఇప్పటిదాకా పాదయాత్ర సాగిన ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు చూసి చలించిపోయాను. అనేక సమస్యలతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో గుడిసెలో నలుగురైదుగురు నివాసం ఉంటున్నారు. డబుల్‌ బెడ్‌రూం హామీ నెరవేరలేదు. నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. 30, 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న పొలాలకు సైతం కొత్త పాస్‌ పుస్తకాలు అందలేదు. ప్రాజెక్టులతో నిర్వాసితులైన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు అందలేదు.

పంటలకు సరైన ధరల్లేవు. పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదు. రుణమాఫీ సరిగా అమలు కావడం లేదు..ఇలా ఎన్నో సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టా డుతున్నారు..’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయా సమస్యలు స్వయంగా తెలు సుకునేందుకు, ప్రజల నుంచి నేరుగా వినేందుకు పాదయా త్ర ఎంతగానో దోహదపడింది. ఎండలో, వానలో మేము వా రి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామనే సంతో షం బాధిత ప్రజల్లో కన్పించింది.

కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తామని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరించి చేదోడువాదోడుగా నిలుస్తామనే భరోసాను, ఆత్మస్థైర్యాన్ని కల్పించగలిగాం..’అని చెప్పారు. సంజయ్‌ చేపట్టిన ‘ప్రజా సంగ్రామయాత్ర’తొలిదశ శనివారం హుస్నాబాద్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర అనుభవాలు, తన దృష్టికి వచ్చిన అంశాలపై సాక్షికి ఆయన ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..  

కేసీఆర్‌ నియంతృత్వ పాలనను ఎండగట్టాం
ముప్పై నాలుగురోజుల మొదటిదశ పాదయాత్ర మరో రెండురోజుల్లో ముగియనుంది. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. కేసీఆర్‌ సర్కార్‌ నియంతృత్వ ధోరణులు, అప్రజాస్వామిక విధానాలు, కుటుంబ ఆధిపత్యంతో కూడిన అవినీతిమయ పాలనను ప్రజల్లో ఎండగట్టగలిగాం. అనేక అంశాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని తెలియజేయగలిగాం.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయానికి, రైతులకు అందతున్న సహాయం, హరితహారం, ఇతర ప«థకాలకు అందుతున్న నిధులను ప్రజలకు తెలియజెప్పాం. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు కేంద్రం నిధులిచ్చినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరిగా ఖర్చు చేయకపోవడాన్ని వివరించాం. గతంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు అవకాశం ఇచ్చినందువల్ల వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా సహాయ, సహకారాలను అందించాలని కోరాం. ఒకసారి మాకు అవకాశమిస్తే మార్పు తీసుకొచ్చి చూపిస్తామని చెబుతుంటే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమౌతోంది. 

ఎన్నికల షెడ్యూల్‌ జారీతో మారిన రూట్‌మ్యాప్‌ 
హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ జారీతో పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను పూర్తిగా మార్చేశాం. ఈసీ కఠిన నిబంధనల కారణంగా శుక్ర, శనివారాల్లో హుస్నాబాద్‌లోనే యాత్ర సాగుతుంది. శనివారం హుస్నాబాద్‌లో రోడ్‌షోతో మొదటిదశ యాత్ర ముగుస్తుంది. అదేరోజు రాత్రి హుజూరాబాద్‌ వెళ్లి ఎన్నికల వ్యూహాలకు తుదిరూపునిచ్చేందుకు ముఖ్యనేతలతో సమావేశమవుతాం. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపిస్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 

6 నుంచి 14 దాకా భవానీ దీక్ష 
అక్టోబర్‌ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అమ్మవారి భవానీ దీక్షలో ఉంటాను. కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఈ దీక్షను కొనసాగిస్తున్నాను. ఈ తొమ్మిది రోజులు రాజకీయాలపై మాట్లాడను. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై దృష్టి పెడతాం. నాలుగు దశలుగా 2023 వరకు పాదయాత్రను కొనసాగిస్తాం. త్వరలోనే రెండో విడత పాదయాత్రను మొదలుపెట్టే అవకాశాలున్నాయి. 

సంజయ్‌ పాదయాత్ర ఇలా... 
సంజయ్‌ పాదయాత్ర గత నెల 28న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి మొదలైంది. ఐదు ఉమ్మడి జిల్లాల (8 కొత్త జిల్లాలు) మీదుగా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. స్థానికంగా పాల్గొనేవారు కాకుండా మొదట్నుంచీ 500 మంది ఆయన వెంట నడుస్తున్నారు. అక్టోబర్‌ 2న హుస్నాబాద్‌లో పాదయాత్ర ముగియనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top