ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: జాజుల

BC Leader Jajula Srinivas Goud Demand To Merge TSRTC With Govt - Sakshi

సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్‌): టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్‌ భవన్‌లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బండి స్వామి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్‌ గౌడ్‌లను నియమించారు.

అనంతరం జాజుల మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధులు కేటాయించకుండా పూర్తిగా అన్యాయం చేశారని అన్నారు. ఆర్టీసీలో చాలాకాలంగా పనిచేస్తున్న కార్మికులకు ప్రమోషన్‌లు ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌ కల్పించాలని, బీసీలపై విధించిన క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. ప్రస్తుతం జరిగే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లుపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top