
సంగారెడ్డి జిల్లాలో ఘటన
కంగ్టి/నారాయణఖేడ్: పోలియో చుక్కలు వేసిన వెంటనే మూడు నెలల మగ శిశువు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరాలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సర్కున్‌దొడ్డి స్వర్ణలత–ఉమేశ్ దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. పోలియో చుక్కలు వేయించేందుకు వీరి నలుగురి పిల్లలను ఆదివారం పల్స్ పోలియో కేంద్రానికి తీసుకొచ్చారు. ముగ్గురు ఆడపిల్లలకు పోలియో చుక్కలు వేసిన తర్వాత, మూడు నెలల శిశువుకు కూడా డ్రాప్స్ వేశారు. చుక్కలు వేసినప్పటి నుంచి శిశువు ఏకధాటిగా ఏడుస్తుండటంతో తల్లి స్వర్ణలత పాలు తాగించే ప్రయత్నం చేసింది.
పాలు తాగుతున్న సమయంలోనే శిశువు మృతి చెందింది. దీంతో పోలియో చుక్కల కారణంగా తమ బిడ్డ చనిపోయాడని స్వర్ణలత ఆరో పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు మృతదేహాన్ని ఖేడ్ ఆస్పత్రికి తరలించారు. శిశువు మృతిపై డీఎంహెచ్‌ఓ నాగనిర్మలను ‘సాక్షి’ వివరణ కోరగా... శిశువు ఏడుస్తుండగా తల్లి పాలు తాగించడంతో ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లి మృతి చెందే అవకాశాలున్నాయని చెప్పారు.
పోలియో చుక్కలు కారణం కాదు
శిశువు మృతికి పోలియో చుక్కలు కారణం కాదని ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాను వైద్యులు, వైద్యాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు చెప్పారు. ఒకే వాయిల్‌లోని చుక్కలను వేయించుకున్న ఇతర చిన్నారులెవరికీ ఏమీ కాలేదన్నారు.