ఒకే గొడుగు కిందకు.. 

Anjayya Selected As CE For Mahabubnagar District - Sakshi

జల వనరుల శాఖ పునర్‌ వ్యవస్థీకరణ పూర్తి 

తుది ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్‌ 

కేబినెట్‌ ఆమోదం పొందిన అనంతరం ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర జల వనరుల శాఖ పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. గత కొన్ని నెలలుగా దీనిపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం పునర్‌ వ్యవస్థీకరణ ముసాయిదాపై ఇంజనీర్లతో మరోమారు చర్చించి ఫైనల్‌ చేశారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న మేజర్, మీడియం, మైనర్, ఐడీసీ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే కేబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. జల వనరుల శాఖ పునర్‌ వ్యవస్థీకరణపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష చేశారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌తో పాటు ఈఎన్‌ సీలు మురళీధర్, నాగేంద్రరావు, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే హాజరయ్యారు.

ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్‌ ఇంజనీర్ల డివిజన్లను 19కి పెంచేందుకు సీఎం నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌ కేంద్రాలుగా సీఈ డివిజన్లు కానున్నాయి. ఈ సీఈల పరిధిలోనే ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌ లు, కాల్వలు, సబ్‌స్టేషన్లు ఉండనున్నాయి. ఒక్కో సీఈ పరిధిలో 5 లక్షల ఎకరాల నుంచి 7లక్షల ఎకరాలు ఉండేలా పని విభజన చేశారు.  

మహబూబ్‌నగర్‌ సీఈగా అంజయ్య.. 
ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న పలు సీఈలు, ఈఈల స్థానంలో కొత్త వారికి బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మహబూబ్‌నగర్‌ సీఈగా అనంతరెడ్డి స్థానంలో ఎస్‌ఈ అంజయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టగా, మైనర్‌ ఇరిగేషన్‌ గోదావరి బేసిన్‌ సీఈగా ఉన్న వీరయ్య స్థానంలో సీడీఓ సీఈ శ్రీనివాస్‌కు బాధ్యతలు ఇచ్చింది. అంతర్రాష్ట్ర జల వనరుల విభాగంలో పనిచేస్తున్న ఇన్‌చార్జి ఈఈ కోటేశ్వర్‌రావు పదవీకాలాన్ని పొడిగించగా, మరో ఆరుగురు ఈఈల స్థానంలో కొత్తవారిని నియమించింది.  

మొత్తంగా ఆరుగురు ఈఎన్‌సీలు.. 
మైనర్‌ ఇరిగేషన్‌ కింద ఇది వరకు కృష్ణా, గోదావరి బేసిన్‌ లలో విడివిడిగా ఉన్న సీఈల పోస్టులను రద్దు చేశారు. ఈ సీఈలతో పాటు మొత్తంగా ఆరుగురు ఈఎన్‌ సీలు ఉండనున్నారు. ఇందులో ఒకరు ప్రాజెక్టుల ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ బాధ్యతలు చూడనున్నారు. ఈ పునర్‌వ్యవస్థీకరణను కేబినెట్‌ ముందు పెట్టి, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించనున్నారు. అక్కడ ఆమోదం పొందిన అనంతరం దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఇదే అంశమై అసెంబ్లీలోనూ ఒక ప్రకటన చేయాలని ఇప్పటికే సీఎం నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top