
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపైనా ఆయన రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12.05కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి 12.20కి సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వస్తారు. 1.45 వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. భోజనానంతరం మధ్యాహ్నం 2 గంటలకు నగర శివార్లలోని కొంగర కలాన్ శ్లోక కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు.
2.10 నుంచి 3.00 గంటల వరకు బీజేపీ నేతలతో జరిగే తొలి విడత భేటీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తారు. పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, ఎన్నికైన 8 మంది ఎమ్మె ల్యేలతో గెలుపోటములను ప్రభావితం చేసిన అంశాలపై షా చర్చిస్తారు. 3 నుంచి 4.30 గంటల వరకు రెండో విడత భేటీలో లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ సన్నద్ధతపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పార్టీ మండల/డివిజన్ అధ్యక్షులు మొదలుకుని జాతీయ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నట్టు సమాచారం. అమిత్ షా సాయంత్రం 5కి తిరిగి హో టల్‌కు చేరుకుని 5.30 వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం ఆయన చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు.