ట్రెజరీ సిబ్బంది వసూళ్ల పర్వంపై ఆరోపణలు
ఆమ్యామ్యాలు ముట్టజెపితేనే బిల్లులు విడుదలవుతున్నాయి అంటున్న బాధితులు.. కొన్ని ట్రెజరీ కార్యాలయాల్లో ఫిక్స్‌డ్ రేట్లు.. మరికొన్ని చోట్ల బిల్లును బట్టి కలెక్షన్
రాష్ట్ర వ్యాప్తంగా చాలా డీటీవో, ఎస్‌టీవోల్లో ఇదే తీరు
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు రూ.20–30 వేలు.. మెడికల్ బిల్లులకు రూ.10 వేలు.. గ్రామ పంచాయతీ బిల్లులకు 2–10 శాతం వసూలు చేస్తున్నారనే ఆరోపణలు
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా ముట్టజెప్పాల్సిందే
లేదంటే లేనిపోని కొర్రీలు.. సర్వర్ పని చేయదు..ఫైల్ కదలదు
చాలాచోట్ల ప్రభుత్వ శాఖల సిబ్బంది మధ్యవర్తిత్వం.. ఉద్యోగ సంఘాల సమన్వయం
కరీంనగర్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని రెండేళ్లయింది. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు 4 నెలల క్రితం ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్‌ను మంజూరు చేసింది. ఈ బిల్లును ట్రెజరీ కార్యాలయం ఆమోదించి ఆయన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంది. ఆ రిటైర్డ్ ఉద్యోగి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. బిల్లు వచ్చిన మాట వాస్తవమే కానీ అన్ని వివరాలు పరిశీలించాలని, పింఛనుకు సంబంధించి కొన్ని వివరాలు లోపించాయంటూ ట్రెజరీ సిబ్బంది లేని కొర్రీలు వేసి పదిరోజుల పాటు తిప్పుకున్నారు. చివరకు అసలు విషయం గ్రహించిన ఆ రిటైర్డ్ ఉద్యోగి.. ఓ ఉద్యోగ సంఘం నేత సహకారంతో ట్రెజరీ సిబ్బందిని సంప్రదించాడు. వారికి కావాల్సిన (తన మొత్తం బిల్లులో 4%) పర్సంటేజీని ముట్టజెప్పడంతో కొర్రీలు ఎటు వెళ్లాయో..! వారం వ్యవధిలోనే డబ్బులు విడుదల కావడం గమనార్హం.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖజానా శాఖ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ నుంచి వచ్చే ప్రతి బిల్లు విడుదల కోసం ఈ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి బిల్లుకు పర్సంటేజీలు నిర్ణయించి మరీ కాసులు కొల్లగొడుతున్నారని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు వాపోతున్నారు. రాష్ట్రంలోని చాలా డీటీవో (జిల్లా ట్రెజరీ కార్యాలయాలు), ఎస్‌టీవోలు (సబ్ ట్రెజరీ కార్యాలయాలు) అవినీతికి అడ్డాలుగా మారాయని, ఫిక్స్‌డ్ రేట్లు పెట్టి కొన్ని చోట్ల వసూలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల బిల్లును బట్టి ఆమ్యామ్యాలు ఇవ్వాల్సిందేనని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు చెబుతున్నారు. పర్సంటేజీల వారీగా ముట్టజెపితే సకాలంలో బిల్లులు మంజూరవుతాయని, లేదంటే కొర్రీలు పెడుతున్నారని, సర్వర్లు పనిచేయడం లేదు.. దరఖాస్తుల్లో తప్పులున్నాయంటూ ఫైల్స్ కదపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ తప్పించుకోవడానికీ ముడుపులు!
ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ట్రెజరీల ద్వారానే చెల్లిస్తుంటారు. కాంట్రాక్టు పనులు, ఉద్యోగుల వేతనాలు, వారికి సంబంధించిన మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు, గురుకులాలకు ఇచ్చే డైట్ చార్జీలు, అద్దె వాహనాలు, వివిధ కార్యాలయాలు, గ్రామపంచాయతీల బిల్లులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు.. ఇలా అన్ని రకాల బిల్లులను చెక్కుల రూపంలో బ్యాంకులకు పంపడం లేదంటే ఆయా బ్యాంకు అకౌంట్లలో వేయడం ట్రెజరీల ద్వారానే జరుగుతుంది. అయితే ఈ బిల్లుల విడుదల కోసం ట్రెజరీ కార్యాలయాల్లో పర్సంటేజీలు ముట్టజెప్పడం మామూలేనని, అయితే ఇటీవల కాలంలో ఈ అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల బిల్లులకు పది శాతం టోకుగా లేదంటే బిల్లును బట్టి ముట్టజెప్పాల్సి వస్తోందని, కనీసం పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నా ట్రెజరీ సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ బిల్లుల విడుదలకు తోడు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆదాయ పన్నుకు సంబంధించిన ‘సహకారానికి’ గాను క్రమం తప్పకుండా ముడుపులివ్వాలని, అలా ఇస్తే వారు పన్ను కట్టే పని లేకుండా ఆడిట్ చేస్తారని చెబుతున్నారు.
కొర్రీలు నమోదు చేయకుండానే..
వాస్తవానికి ఏదైనా బిల్లును తిరస్కరించే సమయంలో ట్రెజరీ సిబ్బంది ఎందుకు తిరస్కరించారనే కారణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ డబ్బులు ముట్టకపోతే కారణాలేవీ నమోదు చేయకుండానే బిల్లులు తిరస్కరిస్తారని, లేదంటే కొర్రీలు వేసి ఫైల్ కదలకుండా చేస్తారని, విధిలేని పరిస్థితుల్లో వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ఈ బిల్లుల చెల్లింపుల కోసం పర్సంటేజీలు ఇచ్చేలా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులే మధ్యవర్తిత్వం వహిస్తారని, కొన్ని చోట్ల ఉద్యోగ సంఘాల నేతలు సమన్వయం చేస్తుంటారని, డీటీవోలు, ఎస్‌టీవోలు ముందు జాగ్రత్తగా ఉద్యోగ సంఘాల నేతలు, పలు శాఖల ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారనే ఆరోపణలున్నా.. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ దృష్టి ఈ ట్రెజరీల మీద పడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నిజామాబాద్ డీటీవోలో..
నిజామాబాద్ జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో ప్రతి పనికి సంబంధిత సెక్షన్‌లోనే డబ్బుల వసూలు జరుగుతోంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉద్యోగుల ఆదాయ పన్ను వివరాలు సమర్పించడం కోసం ప్రతి ఉద్యోగి నుంచి రూ.500 ఎస్‌టీవోల ఆధ్వర్యంలోనే వసూలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు ఉన్న మెడికల్ బిల్లులకు రూ.10 వేలు, దానికి లోపు ఉంటే రూ.5 వేలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. టీఎన్జీవో సంఘంలో నేతలుగా ఉన్న కొందరు ఉద్యోగులు సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. డీటీవో కార్యాలయానికి ఈ నేతల ద్వారానే వెళ్లి డబ్బులు సమర్పించి పనులు చేయించుకుంటున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ బిల్లులు సమర్పించే పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఇలా సమన్వయం చేస్తుంటారు. సకాలంలో బిల్లులు చేయించుకోకపోతే నిధులు వెనక్కు వెళ్లిపోతాయని చెప్పి మరీ రూ.10 వేలు, రూ.20 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో..
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వసూళ్ల దందా యధేచ్చగా సాగుతోంది. ఉద్యోగుల మెడికల్ బిల్లులకు పది శాతం చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఉద్యోగి మెడికల్ బిల్లు రూ.80 వేలు ప్రాసెస్ చేయాలంటే రూ.8 వేలు ఇచ్చుకోవాల్సిందే. లేని పక్షంలో బిల్లుల్లో ఆ వివరాలు లేవని, ఆన్‌లైన్‌లో సర్వర్ తీసుకోవడం లేదంటూ రోజుల తరబడి తిప్పడం పరిపాటి అయిపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూళ్ల దందా సాగిస్తున్నారని తెలుస్తోంది. వచ్చిన ముడుపుల్లో సెక్షన్ల వారీగా పనిచేసే సిబ్బందితో పాటు అధికారులకు వాటాలు అందుతున్నాయని సమాచారం.
బిల్లు స్థాయిని బట్టి..
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎస్టీవో పరిధిలో బిల్లు, ఆ బిల్లు తెచ్చిన వ్యక్తి, ఆ బిల్లుకు సంబంధించిన స్థాయిని బట్టి పర్సంటేజీలు నిర్ణయిస్తున్నారు. ఓ ఉద్యోగి వేతన బిల్లు చేయడంలో లంచం తీసుకోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్‌ను ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కార్యాలయంలో బిల్లుల కోసం ఉపాధ్యాయులు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఎరియర్స్ బిల్లులు మాత్రం బిల్లును బట్టి పర్సంటేజీలు ఉంటున్నాయి.
సూర్యాపేట జిల్లా సూర్యాపేట ట్రెజరీ ఆఫీసులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 25–30 వేలు, మెడికల్ బిల్లుల కోసం రూ.10 వేల దాకా తీసుకుంటున్నారని, గ్రామ పంచాయతీ బిల్లులకు కనీసం 2 శా>తం ఇవ్వాల్సిందేననే ఆరోపణలున్నాయి.
పెన్షన్ ఫైలు చెక్ చేసినందుకూ..
నల్లగొండ జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాల్లో రిటైర్ అయిన ఉద్యోగులు పెన్ష¯న్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆ ఫైల్ చెక్ చేసి పెట్టేందుకు కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడిస్తుందో తెలియని పరిస్థితులున్నా.. సదరు రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం ముందుగానే ట్రెజరీ సిబ్బందికి ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నట్టు సమాచారం.


