Pegasus Spyware: ఫోన్‌లోకి చొరబడితే.. అంతే సంగతి!

Alert Pegasus Software Collect Information From Smartphones - Sakshi

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది.ఉగ్రవాదులు, నేరగాళ్ల పనిపట్టేందుకు తయారైన సాఫ్ట్‌వేర్‌ ఇది. కానీ భారత్‌లో మాత్రం ప్రతిపక్షాలు, విలేకరులపై దీని సాయంతో నిఘా పెడుతున్నారన్న ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. ఈ స్పైవేర్‌ నిజంగా అంత భయంకరమైందా..? వివరాలు తెలుసుకుందాం..

ఏమిటీ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌?
ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అభివృద్ధిపరిచిన ఓ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌. స్మార్ట్‌ఫోన్ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు పనికొస్తుంది. ఈ మాల్‌వేర్‌ లేదా స్పైవేర్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్ల మైక్రోఫోన్, కెమెరా నియంత్రణ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కావాలనుకుంటే ఈ–మెయిళ్లు, లొకేషన్‌ డేటాను కూడా సంపాదించొచ్చు. ఎన్‌క్రిప్టెడ్‌ (రహస్యమైన సంకేత భాషలోకి మార్చేసిన) ఆడియో ఫైళ్లను, మెసేజీలను (వాట్సాప్‌ లాంటివి) కూడా పెగసస్‌ ద్వారా వినొచ్చు, చదవొచ్చని యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారుచేసే కాస్పర్‌స్కై నివేదిక చెబుతోంది.

ప్రభుత్వాలకు మాత్రమే..
2010లో ఏర్పాటైన ఎన్‌ఎస్‌వో గ్రూపు తెలిపిన మేరకు ఈ పెగసస్‌ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే విక్రయిస్తారు. ఉగ్రవాదం, నేరాల నిరోధమే లక్ష్యంగా తాము ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశామని ఈ సంస్థ చెబుతోంది. 2017లో దుబాయ్‌ మానవహక్కుల కార్యకర్త అహ్మద్‌ మన్సూర్‌ తొలిసారి ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించారు.

అప్పట్లో ఆయన స్మార్ట్‌ఫోన్‌ కూడా ఈ మాల్‌వేర్‌ బారినపడటంతో ఈ విషయం బయటకొచ్చింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎస్‌ఎంఎస్‌లు వస్తుండటంతో అతడు తన ఫోన్‌ను సైబర్‌ సెక్యురిటీ సంస్థ సిటిజన్‌ ల్యాబ్‌లో చెక్‌ చేయించాడు. 2016 నుంచే ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్లలో పనిచేస్తున్నట్లు గుర్తించారు.

గుర్తించడం చాలా కష్టం..
స్మార్ట్‌ఫోన్లలో పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ చేరినా దాన్ని గుర్తించడం చాలా కష్టం అంటున్నారు సైబర్‌ నిపుణులు. వాట్సాప్‌ కాల్‌ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్‌ మన ఫోన్‌లోకి చొరపడొచ్చని పేర్కొంటున్నారు. వాట్సాప్‌ కాల్‌ను మీరు కట్‌ చేసేసినా సరే.. ఈ సాఫ్ట్‌వేర్‌ మన ఫోన్లోకి చేరుతుంది. ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఇతరుల ఫోన్లలోకి పంపొచ్చు. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు కూడా గుర్తించకుండా ఉండేందుకు తనను తాను చెరిపేసుకోగల (ఎరేజ్‌) సౌకర్యం కూడా దీంట్లో ఉంది.

ఇతర అప్లికేషన్ల మాదిరిగా అన్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌లో అవశేషాలు వదిలిపెట్టదు. కొంతకాలం కింద వాట్సాప్‌ సంస్థ ఈ పెగసస్‌ విషయంలో ఎన్‌ఎస్‌వో గ్రూపుపై కోర్టులో దావా వేసింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ వద్ద పెగసస్‌ బాధితుల జాబితా ఉన్నట్లు స్పష్టమైంది. పెగసస్‌ చొరబడ్డ స్మార్ట్‌ఫోన్లకు వాట్సాప్‌ స్వయంగా మెసేజీలు పంపిస్తూ అప్‌డేట్‌ చేసుకోవాలని కోరుతోంది. పెగసస్‌ బారిన పడ్డామని తెలుసకునేందుకు ప్రస్తుతానికి ఇదొక్కటే దారి!

ఇతర అప్లికేషన్లపై ప్రభావం ఉంటుందా?
ఇతర అప్లికేషన్లపై దీని ప్రభావం ఏంటన్నది తెలియదు. మైక్, కెమెరా కంట్రోలర్‌ ద్వారా ఫైళ్లు, ఫొటోలు సంపాదించే అవకాశం ఉంది. అలాగే ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజీలు, ఈ–మెయిళ్లు కూడా. అయితే వాటిలో మార్పుచేర్పులు చేసేందుకు పెగసస్‌ అవకాశం కల్పిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి తెలియదు. లొకేషన్‌ డేటా, స్క్రీన్‌షాట్లు తీయడం, టైపింగ్‌ తాలూకు ఫీడ్‌బ్యాక్‌ లాగ్స్‌ను సేకరించడం పెగసస్‌కు ఉన్న అదనపు సామర్థ్యాలు. మన కాంటాక్ట్‌ల వివరాలు, బ్రౌజింగ్‌ హిస్టరీ, మైక్రోఫోన్‌ రికార్డింగ్స్‌ కూడా సేకరిస్తుంది.

ఏం చేయాలి?
స్మార్ట్‌ఫోన్‌లో పెగసస్‌ ఉన్నట్లు తెలిస్తే.. ఆ ఫోన్‌ను వదిలించుకోవడం మినహా వేరే మార్గం లేదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఫోన్‌లో అన్ని అప్లికేషన్ల సాఫ్ట్‌వేర్‌లు అప్‌డేట్‌ చేసుకోవడం మేలని సిటిజన్‌ ల్యాబ్‌ సూచిస్తోంది. ఫ్యాక్టరీ డేటా రీసెట్‌ ఆప్షన్‌ను వాడినా పెగసస్‌ తొలగిపోదని వివరించింది. బ్యాంక్, క్రెడిట్, డెబిట్‌ కార్డుల వివరాలను జాగ్రత్తగా ఉంచుకునేందుకు క్లౌడ్‌ ఆధారిత అప్లికేషన్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని కోరింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top