
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని చాలా మంది అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్‌లో, బంజారాహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి రావన్న సంగతి తెలియదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. మైసూర్‌పాక్‌లో మైసూర్ లేనట్టే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉండదు. 20 శాతం కాలనీలు, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే 80 శాతం బస్తీలే ఉంటాయి. పేద, మధ్యతరగతి వర్గాలే అధికం.
కేవలం శ్రీనగర్ కాలనీ, మధురానగర్ కాలనీ ప్రాంతాలు, రాజీవ్‌నగర్ కాలనీ, సారథినగర్ సొసైటీ, కళ్యాణ్‌నగర్, మోతీనగర్‌లో కొంత ప్రాంతం కాలనీలు ఉండగా, బ్రిగేడ్ గేటెడ్ కమ్యూనిటీ, కల్పతరు, వాసవి బృందావన్, జనప్రియ అపార్ట్‌మెంట్స్ లాంటి కమ్యూనిటీలు ఉన్నాయి. అధికంగా మైనారిటీలు మెజారిటీ ఉండగా తదుపరి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఓసీలు ఉన్నారు. కాగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెరైటీగా ఆరున్నర డివిజన్లు ఉన్నాయి. ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్ ప్రధానంగా ఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డి గూడ, శ్రీనగర్ కాలనీ ఉంటాయి. జూబ్లీహిల్స్‌లో జూబ్లీహిల్స్ లేనట్లు నియోజకవర్గంలో వెరైటీగా ఆరున్నర డివిజన్లు ఉండటం కూడా ఓ విచిత్రమే. – శ్రీనగర్‌కాలనీ