
82 కాలేజీల్లో వంద శాతం సీట్ల కేటాయింపు
ఇంకా మిగిలిపోయిన సీట్లు 5,493
ఆప్షన్లు ఇచ్చినా సీట్లు రానివారు 16,793 మంది
సీట్ల కేటాయింపు..తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ ప్రకారం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్‌లో 77,561 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 5,493 సీట్లు మిగిలిపోయాయి. 82 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. 6,083 మందికి ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు వచ్చాయి. తక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల 16,793 మంది సీట్లు పొందలేకపోయారు. ఈఏపీసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు శుక్రవారం చేపట్టారు. ఆ వివరాలను సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది.
రాష్ట్రంలో 172 కాలేజీల్లో 83,054 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీటి కోసం 94,354 మంది విద్యార్థులు 59,31,279 ఆప్షన్లు ఇచ్చారు. ఈసారి కొత్తగా మాక్ సీట్ల కేటాయింపు చేపట్టారు. దీని తర్వాత విద్యార్థులు ఆప్షన్లు మార్చుకున్నారు. మాక్‌తో పోలిస్తే 36,544 ఆప్షన్లు మారాయి. ఇందులో కొంతమంది కాలేజీలు మార్చుకుంటే, మరికొందరు బ్రాంచీలు మార్చుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తొలిసారిగా ఎస్సీ కుల వర్గీకరణ ప్రకారం ఇంజనీరింగ్ సీట్లు కేటాయించారు.
కంప్యూటర్ కోర్సులదే ఆధిపత్యం: మొదటి విడతలో 77,561 సీట్లు భర్తీ అయితే, ఇందులో 57,042 సీట్లు కంప్యూటర్, ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లోనే ఉన్నాయి. ఈ విభాగంలో 1,700 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. ప్రధాన ప్రాధాన్యత ఎమర్జింగ్, కంప్యూటర్ బ్రాంచీలే అయినా... ఈసారి కోర్ గ్రూపుల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో 16,112 సీట్లు ఉంటే, 14,054 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్‌లో అన్నింటికన్నా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే కొంత మెరుగే కనిపించింది. గత ఏడాది ఈ బ్రాంచీల్లో 40 శాతం సీట్లు కూడా భర్తీ అవ్వలేదు.