Telangana: నిర్లక్ష్యం కాల్చేస్తోంది!  | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం కాల్చేస్తోంది.. తెలంగాణలో రికార్డు స్థాయిలో అగ్నిప్రమాదాలు 

Published Sat, Feb 4 2023 1:41 AM

7327 Fire Accidents Were Recorded In 2021 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోజుకు 20.. వారానికి 140.. నెలకు 600..ఏడాదికి 7,327... రాష్ట్రంలో 2021లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదాలు ఇవి. వీటిలో అత్యధికం మానవ నిర్లక్ష్యం కారణంగానే జరిగినట్లు ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదాలకు కారణాల్లో కాల్చిపారేసిన బీడీ, సిగరెట్లు మొదటి స్థానంలో ఉండగా, షార్ట్‌ సర్క్యూట్‌లు రెండో స్థానంలో ఉన్నాయి.  

దడపుట్టిస్తున్న వరుస ఉదంతాలు..
రాజధానిలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. సికింద్రాబాద్‌ ప్రాంతంలోని రాధా ఆర్కేడ్‌ భవనంలో ఉన్న డెక్కన్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో మంటలు చెలరేగి రోజుల తరబడి తగులబడటం నగరం ఉలిక్కిపడేలా చేసింది. దీని కూల్చివేతలు కూడా కొలిక్కి రాకముందే వనస్థలిపురం, ఎల్బీనగర్‌ల్లోని గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి.

తాజాగా తుది మెరుగులు దిద్దుకుంటున్న కొత్త సచివాలయంలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ప్రమాదాలన్నిటిలోనూ ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. డెక్కన్‌ కార్పొరేట్‌ ఉదంతంలో మాత్రం ముగ్గురు సజీవదహనం కాగా.. ఇద్దరి అవశేషాలు కూడా దొరకలేదు. 

నగరాలు, పట్టణాల్లో షార్ట్‌ సర్క్యూటే.. 
కేవలం గతేడాది మాత్రమే కాదు... ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కాల్చిపారేసిన సిగరెట్, బీడీలే ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ తరహా ఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, జిల్లాల్లో జరుగుతున్నాయి. అక్కడ ఉండే గుడిసెలు తదితరాలకు వీటి వల్ల మంటలు అంటుకుని విస్తరించడంతో భారీ ఆస్తి, ప్రాణనష్టాలు చోటు చేసుకుంటున్నాయి. 2019లో మొత్తం 8,960 అగ్నిప్రమాదాలు జరగ్గా వీటిలో 4,668 కాల్చి పారేసిన సిగరెట్, బీడీల వల్లే జరిగాయి.

ఇక 2020లో 7,899కి 4,187, 2021లో 7,327కి 3,927 ఈ కారణంగానే జరిగాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల 1,866 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇక నగరాలు, పట్టణాల వద్దకు వచ్చేసరికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే ఫైర్‌ యాక్సిడెంట్లకు ప్రధాన కారణంగా ఉంటోంది. విద్యుత్‌ తదితర శాఖలు భవనాల తనిఖీ చేపట్టకపోవడం వల్లే ఇవి చోటు చేసుకుంటున్నాయనే విమర్శలున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా 2019–21 మధ్య వరసగా 2,726, 1,992, 1,866 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

పటిష్ట చట్టం లేదు.. 
ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పట్టించుకోని భవనాల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆయు ధం ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌ యాక్ట్‌. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టమే ఇప్పటికీ ఉండటం గమనార్హం. అయితే ఈ విభాగం కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మిన హా అరెస్టుకు ఆస్కారం లేదు. కేసు కూడా సివిల్‌ కోర్టుల్లో విచారణ జరుగుతుంది. దాదాపు 90% ఉల్లంఘనలకు జరిమానా , మిగిలిన వాటిలో గరిష్ట శిక్ష  3 నెలలు మాత్రమే.  అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల్లో ఒక్క దాంట్లోనూ శిక్ష పడకపోవడం గమనార్హం. సిబ్బంది లేమి  తనిఖీలకు అడ్డంకిగా మారింది.
– అగ్నిమాపక శాఖ మాజీ ఉన్నతాధికారి 

అవసరం మేరకు లేని ఫైర్‌ స్టేషన్లు
ఏటా అగ్నిప్రమాదాలు వేల సంఖ్యలో, ఆస్తినష్టం రూ.వందల కోట్లలో, ప్రాణనష్టం పదుల సంఖ్యలో ఉంటోంది. అయితే రాష్ట్రంలో ఈ మేరకు అవసరమైన సంఖ్యలో అగ్నిమాపక కేంద్రాలు లేవు. సిబ్బంది, శకటాలు సహా ఇతర మౌలికవసతులూ లేవు. జనాభా విస్తీర్ణం ప్రాతిపదికన తీసుకున్నా ఒక్క హైదరాబాద్‌ మహానగరంలోనే 100కు పైగా అగ్నిమాపక కేంద్రాలు, ఒక్కో కేంద్రంలో కనీసం మూడు శకటాలు, కనిష్టంగా 15 మంది సిబ్బంది అవసరం.

అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక కేంద్రాల సంఖ్య 110 దాటట్లేదు. వీటికి తోడు మరో 20 వరకు ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలోనూ 95% కేంద్రాల్లో సాధారణ ఫైర్‌ ఇంజన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగానే బహుళ అంతస్తుల భవనాలు, భారీ సముదాయాలు, పరిశ్రమలు తదితరాల్లో జరిగే అగ్నిప్రమాదాలను అదుపు చేయడం కష్టసాధ్యం అవుతోంది.  
 

Advertisement
 
Advertisement