విషపునీరు తాగి 43 పశువులు మృతి 

43 Cattle Died After Drinking Poisonous Water In Nalgonda District - Sakshi

నల్లగొండ జిల్లాలో ఘటన   

నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయిలో పురుగుమందు కలిసిన నీరు తాగి శుక్రవారం వరకు 30 పశువులు చనిపోగా శనివారం వాటి సంఖ్య 43కు చేరింది. నేరడుకొమ్ము మండలం కాచరాజుపల్లికి చెందిన కృష్ణయ్య, బుచ్చయ్య సోదరులకు పశువుల పెంపకమే జీవనాధారం. తమ ప్రాంతంలో పశుగ్రాసం దొరకని సమయాల్లో మందను ఇతర ప్రాంతాలకు తోలుకుని వెళ్తుంటారు.

ఇదే క్రమంలో సోదరులిద్దరితోపాటు మరో ఎనిమిది మంది 250 పశువుల మందను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి వచ్చారు. అక్కడ పొలాల్లోంచి వదిలిన పురుగుమందున్న నీటిని తాగిన కొన్ని పశువులు మృత్యువాతపడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే 43 పశువులు మృతిచెందడంతో స్థానిక పశువైద్యాధికారుల సమాచారం మేరకు జేడీ యాదగిరి, ఏడీ విశ్వేశ్వర్‌రావు, ఇతర అధికారులు శనివారం మేళ్లవాయి గ్రామాన్ని సందర్శించారు.

ఆ పశువుల శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపారు. అయితే, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకలేదని, క్రిమిసంహారక నీటిని తాగడంతోనే మృతి చెందాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ‘పశువులను మేపుకుని జీవనం సాగిస్తున్నాం. పశువుల మృతితో రూ.లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి’అని పశువుల కాపరులు నేతాళ్ల కృష్ణయ్య, లింగమ్మ కోరారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top