రాష్ట్ర జనాభాలో 40% పట్టణాల్లోనే.. | 40 Percent Of Telangana Population Will Reside In Urban Areas | Sakshi
Sakshi News home page

రాష్ట్ర జనాభాలో 40% పట్టణాల్లోనే..

Apr 17 2026 5:36 AM | Updated on Apr 17 2026 5:36 AM

40 Percent Of Telangana Population Will Reside In Urban Areas

గ్రామీణప్రాంతాల్లోనే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ ప్రజలు 

ఇతర వర్గాలతో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువ వెనుకబాటుతనంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య స్పష్టమైన, లోతైన విభజన 

ధనిక కుటుంబాలు పట్టణాల్లో, పేద కుటుంబాలు గ్రామాల్లో..  

తెలంగాణ ప్రభుత్వ సీప్‌సీ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య స్పష్టమైన, లోతైన విభజనను సీప్‌సీ సర్వే ఎత్తిచూపింది. రాష్ట్ర జనాభాలో 40 శాతం పట్టణాల్లోనే నివసిస్తున్నట్టు వెల్లడైంది. తెలంగాణ సామాజిక–ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సీప్‌సీ)– 2024ను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జనాభాలో 56% ఉన్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు (బీసీలు) పట్టణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న సాధారణ వర్గంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నారు.

అధిక స్థాయిలో వివక్షకు గురవుతున్నారు. ఈ సర్వే 242 కులాలకు సంబంధించిన సుమారు 3.55 కోట్ల మంది వ్యక్తులను (దాదాపు జనాభాలో 97%) కవర్‌ చేసింది. భౌగోళిక అంశాలకు అతీతంగా, పేదరికం అనేది సామాజిక గుర్తింపుతో నిర్మాణాత్మకంగా ముడిపడి ఉందని సర్వే ధ్రువీకరించింది. సాధారణ వర్గాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలు దాదాపు మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నట్లు తేలింది. 

గ్రామీణ–పట్టణ విభజన 
తెలంగాణలో నిరుపేద వర్గం రేటు 9.6%గా ఉంది. రాష్ట్రంలోని 68% ధనిక కుటుంబాలు పట్టణ ప్రాంతాలలో నివసిస్తుండగా, 68% నిరుపేద కుటుంబాలు గ్రామీణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఉపాధిలో కూడా స్పష్టమైన వ్యత్యాసం ఉంది. గ్రామీణ ప్రాంతాల వారు శారీరక, వ్యవసాయ శ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. పట్టణాల్లోని సాధారణ వర్గాలతో పోలిస్తే, దాదాపు 50% షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) కుటుంబాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో శారీరక శ్రమలో నిమగ్నమై ఉన్నాయి. మౌలిక సదుపాయాలైన నీరు, విద్యుత్, మరుగుదొడ్ల అందుబాటులో ఉన్న వ్యత్యాసాలను కూడా సర్వే ఫలితాలు ఎత్తిచూపాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోనూ అధిక శాతం కుటుంబాలు (63%) చిన్న, రెండు గదుల ఇళ్లల్లోనే నివసిస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాల కొరత గ్రామీణ, అభివృద్ధి చెందని ప్రాంతాలలో మరింత ఎక్కువగా ఉంది.

పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ అక్షరాస్యత 
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో అక్షరాస్యత స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీల్లో దాదాపు 36.7% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల ఎస్సీల్లోనే అత్యధిక నిరక్షరాస్యత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 38%తో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కార్యకలాపాలు 51% వాటాతో ఎక్కువగా ఉన్నాయి. పట్టణ నివాసితులకు విస్తృత శ్రేణి రంగాల్లో ఉపాధికి అవకాశం ఉండగా, గ్రామాల్లో చాలావరకు వ్యవసాయం, శారీరక శ్రమకు సంబంధించిన అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని సంపన్న కుటుంబాలలో సుమారు 68% మంది పట్టణ ప్రాంతాలలో నివసిస్తుండగా.. నిరుపేద కుటుంబాలలో కేవలం 20% మంది మాత్రమే నగరాల్లో ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement