22ఏ ఉచ్చు.. తొలగని చిచ్చు | 22A Records Show 3. 95 Lakh Acres of Private Agricultural Land: Telangana | Sakshi
Sakshi News home page

22ఏ ఉచ్చు.. తొలగని చిచ్చు

Oct 12 2026 4:42 AM | Updated on Oct 12 2026 4:42 AM

22A Records Show 3. 95 Lakh Acres of Private Agricultural Land: Telangana

భూముల రక్షణ కోసం పెట్టిన నిబంధన.. రికార్డుల తప్పులతో పట్టాదారులకూ చిక్కులు

ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న అడ్డంకులు 

ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.95 లక్షల ఎకరాల ప్రైవేటు వ్యవసాయ భూములు 22ఏలో  

క్షేత్రస్థాయిలో చూస్తే... అంతకు ఎక్కువగానే నిషేధిత జాబితాలో... 

ఒకే సర్వే నంబర్‌.. ప్రభుత్వ, పట్టా భూములు వేర్వేరు.. కలిస్తే మొత్తం బ్లాక్‌  

పాత రికార్డులు.. డిజిటల్‌ డేటా తేడాలే అసలు సమస్య.. 

హైకోర్టులో 28,611కేసులు

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజారపు రంజిత్‌. జనగామ జిల్లా చిల్పూరు మండలానికి చెందిన ఈయన గత సంవత్సరం 587, 588 సర్వే నంబర్లలో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. చిల్పూరు తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. అత్యవసర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల ఆ ఎకరం భూమిని అమ్మకానికి పెట్టాడు. కొనుగోలుదారుడు ముందుకు రావడంతో అతని పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించడానికి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. ఆ భూమి 22ఏలో చేరిందని, రిజిస్ట్రేషన్ చేయమని అధికారులు తిరస్కరించారు. కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్కు లేని అడ్డంకులు అమ్మేటప్పుడు వచ్చాయని, అధికారులు న్యాయం చేయాలని రంజిత్‌ కోరుతున్నారు.

గడ్డం రాజిరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం 22ఏలోని భూముల రిజిస్ట్రేషన్లోని సమస్యలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నామని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జీఓ 118లోని భూము­లు, యూఎల్‌సీ, వ్యవసా­య భూముల్లో నాలా కన్వర్షన్‌ లేకుండా నిర్మించుకున్న వాటి క్రమబర్థికరణ, పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీ­పీ, జీహెచ్‌ఎంసీ మంజూ­రు చేసిన లే అవుట్‌లలోని ప్లాట్లు, ఫ్లాట్లు, తాజాగా ప్రభు­త్వ భూములను ఆక్రమించుకొని నిర్మించుకున్న 500 చదరపు గజాలలోపు స్థలాల్లోని వాటిని జీఓ 59 కింద పారదర్శకంగా క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు ఇచ్చా­మని స్పష్టం చేస్తోంది.

అయితే పట్టా భూ­ము­లు సీలింగ్, అసైన్డ్, దేవాల­య, వక్ఫ్‌ భూములంటూ 22ఏలో పెట్టిన వాటిపై నిర్ణయం ఇంకా వెలువడలేదు. అధికారుల పొరపాటు వల్ల ఆ భూములను అమ్ము­కుందామనుకున్నా, అమ్ముకోలేక రైతు­లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 22ఏలోని భూములను తాము రిజిస్ట్రేషన్ చేసే సమస్యే లేదంటున్నారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు. రైతుల పొరపాటు లేకపోయినా.. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.

వరంగల్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సెప్టెంబర్ 27 నుంచి గురువారం వరకు 22ఏ కింద 122 దరఖాస్తులు రాగా 82 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో పట్టాభూములు సైతం సీలింగ్, అసైన్డ్‌ భూముల ఖాతాలో ఉండటమే. ఇదే సమస్యతో కాజీపేట మండలం రాంపూర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేశారు. 

ప్రభుత్వం ప్రకటించిన 22ఏ జాబితాలోని భూముల వివరాలు (ఎకరాల్లో)  
అటవీ భూములు - 42,53,532 
అసైన్డ్‌ భూములు - 24,63,940 
ఇతర ప్రభుత్వ భూములు - 29,35,554 
ప్రైవేటు భూములు - 3,95,852  

ఒకే సర్వే నంబర్‌... రెండు రకాల భూములు  
ఒకే సర్వేనంబర్‌లో కొంత ప్రభుత్వ భూమి.. మిగిలినది పట్టా భూమి ఉన్నా దానిని 22ఏ జాబితాలో చేర్చారు. దీంతో ఆ సర్వే నంబర్‌ మొత్తం నిషేధితంగా నమోదైంది. దీంతో పట్టాదారు భూమికీ రిజిస్ట్రేషన్ ఆగింది. ఇలాంటి సమస్యలు ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్‌లతో పాటు పలుచోట్ల వెలుగుచూశాయి.

ఇటీవల 12 ఎకరాల భూమిలో కేవలం రెండు ఎకరాలు మాత్రమే భూదాన్‌ భూమి అయినా, మొత్తం 12 ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లిన ఉదాహరణను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించిన విషయం కూడా తెలిసిందే. గతంలోనూ 22ఏ చిక్కుల నుంచి ఉపశమనం కోరుతూ 2017 నుంచి 2025 మధ్య 28,611 మంది హైకోర్టును ఆశ్రయించినట్టు కూడా వెల్లడించారు. కాగా 22ఏ ఉద్దేశం ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే అయినా, తప్పుడు ఎంట్రీలను సరిచేయకపోతే అదే నిబంధన ప్రైవేటు భూమి యజమానికి అడ్డంకిగా మారుతోంది.  

అమలుకు నోచని ప్రభుత్వ నిర్ణయం  
22ఏ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం సెప్టెంబర్లో మరో కీలక నిర్ణయం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల నుంచి చట్టబద్ధమైన లేఅవుట్‌/బిల్డింగ్‌/అపార్ట్‌మెంట్‌ అనుమతులు పొందిన ఓపెన్‌ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లను కేవలం 22ఏ జాబితాలో ఉన్నాయనే కారణంతో రిజిస్ట్రేషన్ నిరాకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు చెల్లుబాటు అయ్యే అనుమతులు, నిజమైన లింక్‌ డాక్యుమెంట్లు, అనుమతి పొందిన తర్వాత జరిగిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు వంటి షరతులు విధించింది.

కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులకు మాత్రం న్యాయస్థానం తుది నిర్ణయానికి లోబడి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రిజి్రస్టార్, సంబంధిత మున్సిపల్‌/పంచాయతీ ప్రతినిధులతో కమిటీలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు అధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదంటున్నారు.  

ఎక్కడెక్కడ, ఎన్ని ఎకరాలు.. మచ్చుకు కొన్ని... 
⇒ హనుమకొండ జిల్లాలో 79,585 ఎకరాలు 22ఏ జాబితా పరిధిలో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్‌ మిగులు, వ్యవసాయ, వ్యవసాయేతర, దేవాదాయ, వక్ఫ్, ఎస్సారెస్పీ, ప్రభుత్వ ప్రయోజనాలున్న భూములున్నట్టు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌లో 3.28 లక్షల ఎకరాలు ఈ జాబితాలో ఉండగా, 26,390 వరకు ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఇతర కట్టడాలు కూడా 22ఏలో చేరాయి.  

⇒ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 45 వేల ఎకరాలు, 2,117 అపార్ట్‌మెంట్లు, ఇళ్లు ఈ జాబితాలో ఉండగా.. సంగారెడ్డిలో 239 ఫిర్యాదులు నమోదయ్యాయి.  
⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 22ఏలో 2.80 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. 39,468 ఇళ్లు నిషేధిత జాబితాలో ఉండగా, 87 దరఖాస్తుల్లో 42 పరిష్కరించి 19 తిరస్కరించి, 26 పెండింగ్‌లో పెట్టారు.  
⇒ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సెప్టెంబర్ 24 నుంచి మొత్తం 4,309 రిజి్రస్టేషన్లు జరిగినా, 22ఏ సడలింపు కింద వచ్చిన 22 దరఖాస్తుల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు.  

⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 22ఏ జాబితాలో పట్టా భూములు కూడా చేరాయి. ఖమ్మం జిల్లాలో మధిర, వైరా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ ప్రాంతాల్లో 22ఏకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. గత రెండు నెలల్లో ఉమ్మడి జిల్లాలో చలానా చెల్లించిన తర్వాత 12 డాక్యుమెంట్ల రిజి్రస్టేషన్లు నిలిచిపోయాయి. 65కు పైగా ఫిర్యాదులు ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్కు అందాయి. వాటిని రెండు జిల్లాల్లోని సంబంధిత కలెక్టర్లకు పంపారు.  
⇒ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో చూస్తే.. నిర్మల్‌ జిల్లాలో 73,635 ఎకరాలు, వ్యవసాయేతర భూమి 2,117 ఎకరాలు 22ఏ జాబితాలో ఉంది. మంచిర్యాల కార్పొరేషన్‌లో 10 వేల ఇళ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 600లకు పైగా దరఖాస్తులు రాగా ఇప్పటివరకు రెండు మాత్రమే తొలగించారు. మిగతావన్నీ అసైన్డ్, సింగరేణి, సాగునీటి వనరుల పరిధిలో ఉన్నాయి.  

ప్రధాన సమస్యలివి... 
22ఏ నిషేధిత జాబితాలో చేరిన పట్టా, ప్రైవేటు భూముల సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగుతోంది. భూముల స్వభావం, యూఎల్‌సీ, ప్రభుత్వ, ఇనాం భూములకు సంబంధించిన అంశాలు వీటిలో ప్రధానంగా ఉన్నాయి.  
⇒ ఒకే సర్వే నంబర్‌లోని మొత్తం భూమిని 22ఏలో చేర్చిన సందర్భాల్లో.. తమ భూమి యూఎల్‌సీ పరిధిలోకి రాదని రైతులు నిరూపించుకోవాల్సి వస్తోంది. 
⇒ సర్వే నంబర్‌లో యూఎల్‌సీ కింద సేకరించిన భూమి ఎంత? మిగిలిన భూమి ఎంత? రైతు కోరుతున్న భూమి నిషేధిత జాబితాలో ఉండాలా? లేదా? అనే అంశాలపై అధికారులు విచారణ జరిపి నివేదికలు పంపిస్తున్నారు. 

⇒ కాలువల కోసం సేకరించిన భూముల రికార్డుల్లో వ్యవసాయ, వ్యవసాయేతర వర్గీకరణలో తేడాలు ఉండటంతోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. 
⇒ మరోవైపు, 22ఏ నుంచి తొలగించిన భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నవీకరణ కాకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
⇒ కొందరు అధికారుల అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, క్షేత్రస్థాయి విచారణలు, కలెక్టర్‌ ఆమోదం, ఆన్‌లైన్‌ రికార్డుల నవీకరణ ప్రక్రియలను సమన్వయం చేస్తేనే బాధితులకు త్వరితగతిన ఉపశమనం లభించే అవకాశముంది.  

అత్యవసరంగా అమ్ముకునేందుకు వీలు లేకుండా అయింది 
స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని సర్వే నంబర్‌ 667లో నాకు రెండు ప్లాట్లు ఉన్నాయి. సర్వేనంబర్‌ 508/1 లో మరో నలుగురికి ప్లాట్లు ఇప్పించాను. ప్రస్తుతం ఆయా సర్వేనంబర్లలో వెయ్యి గజాలకు పైగా నిషేధిత జాబితాలో ఉంది. అత్యవసర పనులకు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్‌ కావడం లేదు.  
– తాళ్లపల్లి సత్యం, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ జిల్లా  

భూ మార్పిడి జరగడం లేదు  
బచ్చన్నపేట మండల కేంద్రంలో 1994 సంవత్సరంలో నర్ర సోమేశ్వర్‌రెడ్డి వద్ద 106 సర్వే నంబరులో 5 ఎకరాల భూమిని మా అమ్మ కరికే సత్తెమ్మ పేరు మీద కొనుగోలు చేశాం. అందులో రెండు ఎకరాల భూమిని 2011లో అమ్మాం. ఉన్న మూడెకరాల భూమిని నా పేరు మీద మార్పిడికి దరఖాస్తు పెట్టుకోగా, ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్‌ ఆపారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. అప్పటి సీలింగ్‌ ఫైల్‌ కావాలని అంటున్నారు.  
– కరికే అజయ్, బచ్చన్నపేట, జనగామ జిల్లా  
................................................ 
నెల రోజులుగా తిరుగుతున్నా.. 
అచ్చంపేటలో సర్వేనంబరు 169లో మూడేళ్ల కిందట ప్లాట్‌ కొనుగోలు చేశాం. ఇప్పుడు ఈ ప్లాట్‌ను ఇతరులకు అమ్మాను. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వెళితే ఆర్డీఓ ఇచ్చిన 22ఏలో ఉందని చెబుతున్నారు. నెలరోజులుగా రిజిస్ట్రేషన్‌ ఆగింది. ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నా ఇప్పుడు..అప్పుడు అంటున్నారు.  
– మదిలి శ్రీశైలం, ఉప్పునుంతల, నాగర్‌కర్నూల్‌ జిల్లా 

22ఏ జాబితాలో ఉంటే సబ్‌ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయాలి 
22ఏ జాబితాలో మీ భూమి చేరినట్టయితే సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయాలి. సబ్‌ రిజిస్ట్రార్ ఆన్‌లైన్‌లో కలెక్టర్‌కు నివేదిక అందజేస్తారు. రికార్డుల పరిశీలన అనంతరం కలెక్టర్‌ అనుమతి ఇస్తేనే సబ్‌ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. 22ఏ సమస్యకు భూ క్రయ విక్రయదారులు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో సంప్రదించాలి.  
– ప్రవీణ్‌కుమార్, డీఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, వరంగల్‌

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని సర్వేనంబర్‌ 1057లో రైతు రేళ్ల నరసింహారావుకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి ఆయనకు వారసత్వంగా సంక్రమించింది. ఆ భూమికి సంబంధించి పట్టాదార్‌ పాస్‌బుక్కు కూడా ఉంది. ఆయన పట్టా భూమి 22ఏ నిషేధిత జాబితాలోకి చేరింది. ఈ విషయమై ప్రభుత్వ ప్రకటన తర్వాత పలుమార్లు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా 22ఏ జాబితా నుంచి తొలగించలేదని నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement