Southwest Monsoon Arrives In Telangana: IMD Issues Heavy Rainfall Warning - Sakshi
Sakshi News home page

తెలంగాణకు చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్‌..

Jun 22 2023 4:02 PM | Updated on Jun 22 2023 4:42 PM

Southwest Monsoon Arrives Telangana IMD Issues Heavy Rainfall Warning - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణకు ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. ఖమ్మం వరకూ నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంతమేర తగ్గనుంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఆవర్తనం ఏర్పడిందని, దీని కారణంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు గాలులు వీస్తున్నాయని వాతావావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల మూడు రోజులు  తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
చదవండి: సిద్దిపేటకు రైలు.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు

నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ములుగు ,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ హైదరాబాద్‌ కేంద్రం తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

సాక్షి, అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. పార్వతీపురం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. 

ఏలూరు జిల్లాలోని  జంగారెడ్డిగూడెం, ఏలూరులో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పల్నాడు జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు వీస్తున్నాయి. రాజుపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, నకరికల్లు, పెదకూరపాడు, నూజెండ్లలో వర్షం పడగా.. ఈదురుగాలులకు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement