IT Raids On BRS MLA Pailla Shekar Reddy's Residence; Money And Documents Seized - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీ నగదు, డాక్యుమెంట్స్‌ సీజ్‌!

Published Wed, Jun 14 2023 7:03 PM

IT officials Seized Money And Documents In MLA Paila Shekar Reddy House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సూర్యాపేట: బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల 12 గంటలుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి  ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. 

ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్‌ చేసినట్టు సమాచారం. కాగా, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్‌ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ​కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. 

ఈ క్రమంలో పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.

ఇక, ఐటీ దాడులపై ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపు కోసమే.. కేంద్రంలో ఉన్నా బీజేపీ తమ ఇంటిపై ఐటీ సోదాలు చేయించింది. ఆ బెదిరింపులకు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని, తాను పూర్తిగా వైట్‌ పేపర్‌ అని స్పష్టం చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచే పాన్‌కార్డు తీసుకున్నానని, నాటి నుంచి నేటి వరకు మా వ్యాపారం పూర్తిగా వైటే అని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్న త‌న‌ కూతురు ఐటీ అధికారులకు సెర్చ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు.

ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై జరుగుతున్న ఐటీ దాడులపై మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ దాడులతో బీఆర్‌ఎస్‌ నేతలను బీజేపీ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. ఇలాంటి దాడులకు మేం భయపడే ప్రసక్తే లేదు. రాజకీయ కక్షలో భాగమే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు. శేఖర్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారవేత్త. రాజకీయంగా శేఖర్‌ రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడం పిరికి పందల చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో

Advertisement
Advertisement