– వినికిడి, దృష్టిలోపం ఉన్న వ్యక్తులను గుర్తించాలి
సాక్షి, చైన్నె: 2027 జనాభా గణనలో వినికిడి, దృష్టిలోపం ఉన్న వ్యక్తులను గుర్తించాలని సెన్స్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు సెన్స్ ఇంటర్నేషనల్ కు చెందిన విభాగం ఉడాన్ తోపాటు స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ తమిళనాడు సంయుక్తంగా చైన్నె ప్రెస్ క్లబ్ వేదికగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో వినికిడి, దృష్టిలోపం ఉన్న ఉడాన్ నెట్‌వర్క్‌కు చెందిన నలుగురు మహిళలు మాట్లాడారు. తమ తమ జీవిత ప్రయాణాలను పంచుకున్నారు. వినికిడి, దృష్టిలోపం ఉన్న వారికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాలపై ప్రాధానంగా మాట్లాడారు. అలాగే 2027 జనాభా గణనలో తమకు ప్రత్యేకంగా గణన చేపట్టాలని, ముఖ్యంగా బాలికలు, మహిళలు, సంబంధిత వర్గాలతో నేరుగా సంభాషించడానికి, తమ హక్కుల కోసం వాదించడానికి అవకాశం కల్పించాలని పేర్కోన్నారు. సైన్స్ ఇంటర్నేషనల్ ఇండియా సీఈఓ ఉత్తమ్ కుమార్ పేర్కోంటూ వినికిడి లోపం ఉన్న బాలికలు, మహిళలను కేవలం సేవలు పొందే వారిగా కాకుండా, నాయకులుగా, గొంతుకలుగా, నిర్ణయాలు తీసుకునే వారిగా గుర్తించాలని కోరారు.


