సాక్షి, చైన్నె: తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూర్–సిప్కోట్ పారిశ్రామిక ప్రాంతంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న ఒక ఫ్యాక్టరీ భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. హోసూర్ సిప్కోట్ పరిధిలోని వేదరపల్లి వద్ద కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం భవనం పైకప్పుకు (కాన్క్రీట్ స్లాబ్) కాంక్రీట్ పోసే పనులు జరుగుతున్న సమయంలో, మద్దతుగా ఉన్న జాకీలు , పిల్లర్ భాగం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆ సమయంలో ప్రమాద స్థలంలో 15 మందికి పైగా కార్మికులు పని చేస్తుండగా, భవన శిథిలాల కింద పలువురు తీవ్రంగా చిక్కుకుపోయారు.
సహాయక చర్యలు – ప్రాణనష్టం
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక సిబ్బంది, సిప్కోట్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ క్రేన్లు, శిథిలాల తొలగింపు పరికరాల సహాయంతో తీవ్రంగా శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. ప్రాథమిక పోలీసు విచారణ ప్రకారం, మరణించిన ముగ్గురు కార్మికులు తిరుపత్తూరు జిల్లాకు చెందిన మైఖేల్ (27), సీను (24), కుమారేసన్ (25) గా గుర్తించారు. వీరు హోసూర్‌లో నివసిస్తూ రోజువారీ నిర్మాణ పనులకు వెళ్తున్నారు.: ఈ ప్రమాదంలో 5 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది వారిని శిథిలాల నుంచి రక్షించి, తక్షణ చికిత్స నిమిత్తం హోసూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో అగ్నిమాపక దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై సిప్కోట్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.


