ప్రతిష్టాత్మక యూనిట్‌ సైటేషన్‌ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక యూనిట్‌ సైటేషన్‌ పురస్కారం

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

– ఆవడి ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌కు గవర్నర్‌ ప్రదానం

సాక్షి, చైన్నె : భారత వైమానిక దళానికి చెందిన కీలక లాజిస్టిక్స్‌, శిక్షణ కేంద్రమైన ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ ఆవడి అత్యుత్తమ సేవలకు గాను ప్రతిష్టాత్మక యూనిట్‌ సైటేషన్‌ పురస్కారాన్ని దక్కించుకుంది. ఆపరేషనల్‌ సన్నద్ధత, లాజిస్టిక్‌ మద్దతు, శిక్షణ , సిబ్బంది సంక్షేమానికి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ తమిళనాడు గవర్నర్‌ అర్లేకర్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు.చైన్నెలోని లోక్‌ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తమిళనాడు గౌరవ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ ఆవడి ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఎయిర్‌ కమోడోర్‌ ప్రదీప్‌ శర్మ కు ఈ సైటేషన్‌ను స్వయంగా అందజేశారు.విధి నిర్వహణ, శిక్షణా బాధ్యతలతో పాటు ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ ఆవడి స్థానిక ప్రజల సంక్షేమానికి, ఆరోగ్యానికి విశేష కృషి చేస్తుండటం విశేషం.

మెట్టూరు డ్యామ్‌లో

చీఫ్‌ ఇంజినీర్‌ పరిశీలన

సేలం: సేలం జిల్లాలోని ప్రసిద్ధ మెట్టూరు డ్యామ్‌ వద్ద జలవనరుల శాఖ తిరుచ్చి జోన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జయకుమారి బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నైరుతి రుతుపవనాల కాలం ముగిసి, ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో నియమానుసారం చేపట్టే కాలానుగుణ తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ పరిశీలన నిర్వహించారు.సాంకేతిక పరికరాల పరిశీలన: డ్యామ్‌ కుడి ఒడ్డు భాగంలోని నీటి కొలత పరికరాలు, ఆటోమేటెడ్‌ గేజింగ్‌ సిస్టమ్స్‌ , ఎగువ స్లూయిస్‌ గేట్లను బృందం తనిఖీ చేసింది. అనంతరం డ్యామ్‌ పొడవునా 1.5 కిలోమీటర్లు నడిచి వెళ్లిన చీఫ్‌ ఇంజనీర్‌, భూకంప నిరోధక సాధనాలు సహా డ్యామ్‌లో అమర్చిన వివిధ పరికరాల పనితీరుపై అధికారులతో సమీక్షించారు.

మరమ్మతు పనులపై ఆదేశాలు

డ్యామ్‌ ఎడమ ఒడ్డు వద్ద ఉన్న 16–గేజ్‌ వంతెన ఆర్చ్‌ల బలోపేతం పనులను జయకుమారి పరిశీలించారు. స్లూయిస్‌ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ తనిఖీ కార్యక్రమాలలో సేలం అప్పర్‌ కావేరీ బేసిన్‌ మానిటరింగ్‌ ఇంజనీర్‌ శివకుమార్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సెల్వరాజ్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లు సతీష్‌కుమార్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా మెట్టూరు డ్యామ్‌లోకి నీటి ఇన్‌–ఫ్లో క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం సెకనుకు 3,777 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం, బుధవారం ఉదయానికి 4,614 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం56.38 అడుగులుగా, నీటి నిల్వ22.06 టీఎంసీలు గాఉంది.డెల్టా సాగుకు సెకనుకు 1,000 క్యూసెక్కుల నీరును విడుదల చేస్తున్నారు.

విడుదలైన రోజే పూర్తిగా అమ్ముడైన స్టాంప్‌ పాస్‌పోర్ట్‌

సాక్షి, చైన్నె : తమిళనాడులోని 58 ముఖ్యమైన పర్యాటక , చారిత్రక ప్రదేశాల చిత్రాలతో తపాలా శాఖ తాజాగా విడుదల చేసిన ప్రత్యేక స్టాంప్‌ పాస్‌పోర్ట్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రవేశపెట్టిన ఒక్కరోజే ఇవి పూర్తిగా అమ్ముడైపోవడం విశేషం.

58 ప్రదేశాల చిత్రాలు: ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్‌లో కుట్రాలం, తిరుచెందూర్‌, మనపాడు, ముట్టం, తంజావూరు, పిచ్చావరం, కన్యాకుమారి వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలతో పాటు మరిన్ని ప్రత్యేక స్థలాలు పొందుపరిచారు. స్టాంపులు సేకరించడంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువకులు తాము సందర్శించే ప్రాంతాల్లోని పోస్టాఫీసులకు వెళ్లి ఈ పాస్‌పోర్ట్‌లో ఆయా తపాలా కార్యాలయాల రిజిస్ట్రేషన్‌ ముద్రలను వేయించుకోవచ్చు. జ్ఞాపికగా , వినోదం కోసం పిల్లలు, యువకులు దీనిని ఉపయోగించుకోవచ్చని డైరెక్టర్‌ సుందరేశ్వరి తెలిపారు.ఈ పాస్‌పోర్ట్‌ ధర రూ. 650గా ఉంది. చైన్నె జి.పి.ఓ., తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై , పుదుచ్చేరి పోస్టాఫీసులలో మాత్రమే వీటిని విక్రయించారు.

మళ్లీ ముద్రణకు సన్నాహాలు: బెంగళూరు తర్వాత తమిళనాడులో రెండోసారి ప్రవేశపెట్టిన ఈ పాస్‌పోర్ట్‌కు సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం లభించింది. దీంతో చైన్నెలో వెయ్యికి పైగా ప్రజలు గుమిగూడగా, బెంగళూరు నుంచి వచ్చిన యువకులు రాత్రి ఇక్కడే బస చేసి మరీ వీటిని కొనుగోలు చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధి కారులు, సైకిల్‌ యాత్రికులు, పర్వతారోహకులు సైతం ఈ పాస్‌పోర్ట్‌ల కోసం క్యూ కట్టారు. అయితే తొలి విడతలో వీటిని తక్కువ సంఖ్యలో ముద్రించడంతో వెంటనే అమ్ముడైపోయాయి. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దష్టిలో ఉంచుకుని, త్వరలోనే మరిన్ని పాస్‌పోర్ట్‌లను అమ్మకానికి పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement