సాక్షి, చైన్నె : దీపావళి పండుగను పురస్కరించుకుని చైన్నె నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంత ఊళ్లకు ప్రయాణం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ రద్దీని తట్టుకోవడానికి ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చడానికి రవాణా శాఖ, దక్షిణ రైల్వే భారీ ఏర్పాట్లు చేశాయి. చైన్నె నుంచి ప్రతిరోజూ సుమారు 6 లక్షల మంది ప్రయాణికులు తమ స్వస్థలాలకు తరలివెళ్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.పండుగ వేళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చైన్నె సెంట్రల్ నుండి 98 రైళ్లు, ఎగ్మోర్ , తాంబరం స్టేషన్ల నుండి 85 రైళ్లు బయలుదేరుతున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 3.65 లక్షల మంది ప్రయాణించనున్నారు. దక్షిణ జిల్లాలకు వెళ్లే దాదాపు అన్ని రైళ్లలో టిక్కెట్లు పూర్తయిపోయాయి, వెయిటింగ్ లిస్ట్ 200 దాటింది. ఇక, రాష్ట్ర రవాణా శాఖ రోజువారీ బుకింగ్ కోటాను 1.35 లక్షల నుండి 2 లక్షలకు పెంచింది. దీని ద్వారా ప్రతిరోజూ 1.70 లక్షల మంది ప్రయాణిస్తారు. ప్రైవేట్ బస్సుల ద్వారా మిగిలిన 60 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని అంచనా.
10,600 ప్రత్యేక బస్సులు సిద్ధం
కిలాంబాక్కం, కోయంబేడు , మాధవరం బస్ టెర్మినళ్ల నుండి ప్రత్యేక సర్వీసులతో సహా మొత్తం 10,600 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. రవాణా శాఖ కార్యదర్శి ఎల్. నిర్మల్‌రాజ్ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే నాగర్‌కోయిల్, కన్యాకుమారి, తెన్‌కాశి, రామేశ్వరం, నైల్లె, మదురై, విరుదునగర్, తిరుచ్చి, తంజావూరు వంటి దక్షిణ, డెల్టా జిల్లాలతో పాటు కళ్లకురిచి, తిరువన్నామలై ప్రాంతాలకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రవాణా శాఖ మంత్రి విజయ్ పార్తీబన్ స్పందిస్తూ డ్రైవర్లు,క ండెక్టర్లు ప్రయాణీకులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇక, ప్రజలు తమసొంత వాహనాలలో స్వస్థలాలకు బయలు దేరునున్న దృష్ట్యా, నాలుగు రోజుల పాటుగా వారికి టోల్ వసూళ్లను రద్దు చేయాలని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ మాండ్ చేశారు. కాగా, కొట్టాయం, రామనాథపురం, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు దక్షిణ రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అలాగే,అన్ రిజర్వుడ్ రైళ్లను సైతం కొన్ని మార్గాలలో ప్రకటించారు. 6వ తేదీ ఈరైళ్లు బయలు దేరుతాయి.
పోలీసులతో భారీ భద్రత
చైన్నె నగరంలో ప్రజల భద్రత కోసం చైన్నె గ్రేటర్ పో లీస్ విభాగం అత్యంత కట్టుదిట్టమైన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. చైన్నె నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ. అమల్‌రాజ్, ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా దాదాపు 18 వేల మంది పోలీసు అధికారులతో భారీ భద్రతా బలగాలను రంగంలోకి దించారు.షాపింగ్, పండుగ కొనుగోళ్ల కోసం ప్రజలు ఎక్కువగా వచ్చే టీ.నగర్ , పాండిబజార్, పురసైవాక్కం, ఎన్.ఎస్.సి. బోస్ రోడ్, ఎం.సి.రోడ్, కోయంబేడు, అన్నా సాలై తదితర ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో 25 తాత్కాలిక నిఘా టవర్లు , 37 బైనాక్యులర్ టీమ్‌లు , 7 డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. కాగా, తమిళనాడు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, దీపావళి రోజున ఉదయం 6 నుండి 7 వరకు, రాత్రి 7 నుండి 8 వరకు మాత్రమే బాణసంచా కాల్చడానికి అనుమతి ఉంటుందని ప్రకటించారు. బాణసంచా దుకాణాల వద్ద అగ్నిమాపక, ఆరోగ్య శాఖలతో కలిసి తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల బాణా సంచాదుకాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


