బంగాళాఖాతంలో ద్రోని | - | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో ద్రోని

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

న్యూస్‌రీల్‌

తుపానుగా మారే అవకాశం

’అర్నాబ్‌’గా నామకరణం

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

ఉత్తర తమిళనాడులో పలు జిల్లాలకు సెలవు

ఐదు రోజులపాటు మరింతగా వానలు

సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చైన్నె శివారు ప్రాంతాల్లో రాత్రుళ్లు కొండపోత వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉత్తర తమిళనాడులోని విల్లుపురం, కల్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాల్లో భారీ వర్షం పడడంతో ఉదయం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

అర్నాబ్‌ తుపాను ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈ నెల 26వ తేదీ నాటికి పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు అర్నాబ్‌ అని నామకరణం చేశారు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నందున తమిళనాడుకు ప్రత్యక్ష ముప్పు లేకపోయినా, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 28 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూరు, తిరునెల్వేలి జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడ బలమైన ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, సేలం, నామక్కల్‌, మదురై, విరుదునగర్‌, తేని, తెన్కాసి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. గడిచిన 24 గంటల్లో విరుదునగర్‌ జిల్లా సత్తూరులో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే చిన్నగామన్‌పట్టిలో 14, దిండిగల్‌ జిల్లా సముద్రంపట్టిలో 13, కుప్పనాథం, మదురై జిల్లా కొప్పునాథం, కడలూర్‌ జిల్లా విరుదాచలంలో గరిష్ట వర్షపాతం నమోదైంది. దుండిగల్‌ 11 సెంటీమీటర్లు, నత్తమ్‌, కొడైకెనాల్‌, నడుమండలం, మదురై, వాడిపట్టి, పుదుచ్చేరిలోని తిరుకనూరులో 10 సెం.మీ, ఈరోడ్‌ జిల్లాలోని సావంతపూర్‌లో 10 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.

చతురగిరి ఆలయ ట్రెక్కింగ్‌పై నిషేధం

పశ్చిమ కనుమల ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండవాగుల్లో నీటి ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా చతురగిరి సుందర–చందన మహాలింగం ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులు ట్రెక్కింగ్‌ చేయడానికి అటవీ శాఖ తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇక ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ముల్లై పెరియార్‌ ఆనకట్ట నీటి మట్టం ఒక్కరోజే 2 అడుగులు పెరిగి 119.75 అడుగులకు చేరింది. ఈ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ముందు జాగ్రత్త చర్యలు

తిరునల్వేలి, కన్యాకుమారి, కోయంబత్తూరు తదితర ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అధికారులు, మంత్రుల వివిధ విభాగాల సమన్వయంతో పకడ్బందీగా ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement