సాక్షి, చైన్నె: ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా శుక్రవారం అఖిల భారత ప్రజల వేదిక సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పుదుచ్చేరిలో నిరసన ప్రదర్శన చేశారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని లోక్‌భవన్ (రాజ్ భవన్) వైపు బయలుదేరారు. ఈ ర్యాలీలో అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు సుధాసుందర్‌రామ్, విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు సమీనాథన్, మంగయ్యర్ సెల్వన్, ఎళిలన్, మత్స్యకారుల సంఘం, యూత్ ఫోరం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రాతిపదికన రూపొందించిన ఓటర్ల జాబితాల ఆధారంగా రాబోయే ఎన్నికలను నిలిపివేయాలని, ఇప్పటికే నిర్వహించిన ఎన్నికలను రద్దు చేయాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని, దానివల్ల జాబితా నుంచి తొలగించిన 13 కోట్ల మంది ఓటర్లను తిరిగి చేర్చాలని కోరారు. 2024కి ముందు ఉన్న ఓటర్ల జాబితాల ఆధారంగా, పారదర్శకమైన ప్రజా ఆడిట్ నిర్వహించిన తర్వాతే జాబితాలను నవీకరించాలని నినాదాలు చేశారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
రాజా సినిమా థియేటర్ సమీపంలో ప్రారంభమైన ఈ ర్యాలీ అన్నాసాలై, ఎస్.వి.పటేల్ సాలై మార్గంలో గవర్నర్ భవనం వైపు సాగింది. మిషన్ రోడ్ – ఎస్.వి.పటేల్ సాలై కూడలి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు అక్కడే రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.


