సాక్షి చైన్నె: నామ్ తమిళర్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర సమన్వయకర్త కార్తీకతో పాటు మరో 9 మంది శుక్రవారం కోయంబత్తూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. వీరికి గురువారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అభ్యర్థి సత్యభామకు మద్దతుగా ముఖ్యమంత్రి విజయ్ ఈనెల 4న ప్రచారం చేశారు. ఆ సమయంలో వీరాచ్చిమంగళం ప్రాంతంలో ముఖ్యమంత్రి రాకకు కొద్ది నిమిషాల ముందు నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థి కార్తీక తన కార్యకర్తలతో కలిసి వాహన ర్యాలీగా వచ్చారు. సీఎం రాకను పురస్కరించుకుని అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు వారిని వేరే మార్గంలో వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో నామ్ తమిళర్ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో సీఎం వాహనం అటుగా రావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఎన్నికల ప్రచార సమయంలో ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారానికి సంబంధించి కార్తీక నేతృత్వంలో ఎన్‌టీకే కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ ఘటనపైనా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో 20న కార్తీకను అరెస్టు చేశారు. ఆమెతో పాటు మొత్తం 9 మంది అరెస్టయ్యారు. నామ్ తమిళర్ పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ సహా పలు రాజకీయ పార్టీల ప్రముఖులు కార్తీక అరెస్ట్‌ను ఖండించారు. అనంతరం పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారిని కోయంబత్తూరు కేంద్ర జైలుకు రిమాండ్‌కు తరలించింది. వారు ధారాపురం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గురువారం విచారణ జరగ్గా కార్తీకతో పాటు ఆమె భర్త మురుగ చంద్రకుమార్ సహా 9 మందికి న్యాయమూర్తి ఉమా మహేశ్వరి బెయిల్ మంజూరు చేశారు. దీంతో శుక్రవారం ఉదయం కోయంబత్తూరు కేంద్ర జైలు నుంచి విడుదలైన కార్తీక సహా 9 మందికి నామ్ తమిళర్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


