సాక్షి చైన్నె: చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయ రన్‌వేపై వర్షాకాలంలో నీరు నిలవకుండా నిరోధించేందుకు రూ.22 కోట్లతో రూపకల్పన చేసిన వర్షపు నీటి కాలువల ప్రాజెక్టు ఆరు నెలలుగా నిలిచిపోయింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిధుల కేటాయింపులో ఏర్పడిన ఆలస్యమే దీనికి ప్రధాన కారణం. 2015లో సంభవించిన భారీ వరదల సమయంలో చైన్నె విమానాశ్రయం తీవ్రంగా ప్రభావితమైంది. రన్‌వేపై నీరు నిలవడంతో విమానాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమీపంలోని పల్లవరం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కురిసే వర్షపు నీరు రన్‌వే డ్రైనేజీ గుండా బయటకు వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోవడం ప్రధాన సమస్యగా మారింది. వర్షపు నీటిని అడయార్ నదిలోకి మళ్లించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న రహదారిని తవ్వి దాని ద్వారా నీటిని అడయార్ నదికి అనుసంధానించేలా నీటి వనరుల సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేశారు. అన్ని సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినప్పటికీ ఏ ఏ ఐ అంతర్గత కమిటీ పరిశీలన పేరుతో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో రన్‌వేపై నీరు నిలవడం వల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లతో పాటు ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీనివల్ల విమానాల ఆలస్యం లేదా ఇతర విమానాశ్రయాలకు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం విమానాశ్రయంలో విస్తరణ పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో వర్షపు నీటి నివారణ వ్యవస్థను మెరుగుపరచడం కూడా అత్యంత కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై నీటి వనరుల శాఖ అధికారులు మాట్లాడుతూ రూ.22 కోట్ల ప్రాజెక్ట్ నివేదిక సిద్ధంగా ఉందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులను విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. లేనిపక్షంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకే మీద నీరు చేరుతున్న తరుణంలో మరింత భారీ వర్షాలు పడితే విమానాశ్రయం వరదముంపుకు గురి కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.


