సాక్షి చైన్నె: తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో పీడీల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 188 ప్రభుత్వ కళాశాలలు ఉండగా 97 కళాశాలల్లో పీడీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. పీడీల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వ కళాశాలల ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో క్రీడా సదుపాయాలను మెరుగుపరచడానికి, పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రతి ఏటా ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. క్రీడల్లో రాణించి, శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లు అందించాలని, ఇతర కళాశాలలతో పోటీలకు విద్యార్థులను పంపడానికి, కళాశాలల్లో క్రీడా ఉత్సవాలు నిర్వహించడానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో క్రీడాభివృద్ధి, ఖాళీల భర్తీపై చర్చించేందుకు చైన్నె విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.విశ్వనాథన్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ధీరజ్ కుమార్, కళాశాల విద్యా కమిషనర్ పి.పొన్నయ్య, జిల్లా జాయింట్ డైరెక్టర్లు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. వీటిని సీఎం విజయ్ దృష్టికి తీసుకెళ్లి అమలు చేసేందుకు కసరత్తు చేపట్టారు.
శ్రీలంక నుంచి అక్రమ ప్రవేశం
సాక్షి, చైన్నె: శ్రీలంక నుంచి సముద్ర మార్గాన అక్రమంగా తమిళనాడులోకి ప్రవేశించిన ముగ్గురు శ్రీలంక పౌరులతో పాటు వారికి సహకరించిన పడవ నడిపే వ్యక్తిని క్యూ డివిజన్ (క్యూ బ్రాంచ్) పోలీసులు అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా పాంబన్ దక్షిణవాడి తీరంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన ఒక పైబర్ పడవను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉన్న రామేశ్వరానికి చెందిన బోట్ డ్రైవర్ ముత్తురాజా (44), శ్రీలంకకు చెందిన దర్శన్ (34), మహమ్మద్ ఖాన్ (32), మహమ్మద్ ఆసిక్ (25)ను విచారించారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీలంకకు చెందిన దర్శన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు ద్వారా పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చి నామక్కల్‌లో నివాసముంటున్నాడు. శ్రీలంక నుంచి ఇద్దరిని తమిళనాడుకు తీసుకువచ్చేందుకు డ్రైవర్ ముత్తురాజాతో రూ.1.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గురువారం సాయంత్రం ధనుష్కోడి నుంచి బయలుదేరిన వీరు అంతర్జాతీయ సముద్ర సరిహద్దులో వేచి చూసి శ్రీలంక నుంచి వచ్చిన మహమ్మద్ ఖాన్, మహమ్మద్ ఆసిక్‌ను తమ పడవలోకి ఎక్కించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాంబన్ తీరానికి చేరుకున్నారు. అరెస్టయిన ఖాన్, ఆసిక్ నకిలీ పాస్‌పోర్ట్‌ల ద్వారా లండన్ వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై క్యూ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సీబీఆర్‌ఎన్ జోనల్ పోటీల విజేత తమిళనాడు
సాక్షి, చైన్నె: రసాయన, జీవ, రేడియోధార్మిక అణు (సీబీఆర్‌ఎన్) ప్రమాదాల నివారణకు సంబంధించిన జోనల్ స్థాయి పోటీల్లో తమిళనాడు విపత్తు ప్రతిస్పందన దళం అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఈ ల 12 నుంచి 15వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. ఇందులో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. తమిళనాడు తరఫున డిప్యూటీ చీఫ్ ఎస్.మణిమారన్ నేతృత్వంలోని 13వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు ఎస్‌ఐలు, 17 మంది పోలీసులతో కూడిన మొత్తం 20 మంది సభ్యులు పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించారు. వారిని పోలీసు సాయుధ దళాల విభాగం అదనపు డీజీపీ ఆర్.దినకరన్ అభినందించి సత్కరించారు. విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆవడి ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కమాండర్ ఎస్.విజయకుమార్ పాల్గొన్నారు. జోనల్ స్థాయిలో సత్తా చాటిన తమిళనాడు విపత్తు ప్రతిస్పందన దళం, తదుపరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో గల ఎన్‌డీఆర్‌ఎఫ్ 8వ బెటాలియన్‌లో నవంబర్ 2 నుంచి 4 వరకు జరగనున్న జాతీయ పోటీల్లో తలపడనుంది. గత సంవత్సరం జరిగిన ప్రాంతీయ, జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రథమ స్థానం సాధించి, తమిళనాడు ప్రత్యేక పోలీసు దళం 13వ బెటాలియన్ బృందం ఇప్పటికే ఒక చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది.


