చైన్నెలో దంచికొట్టిన భారీ వర్షం
రాత్రంతా టెన్షన్
యుద్ధ ప్రాతిపదికన సహాయక పనులు
ప్రధాన మార్గాల్లో తొలగిన నీరు
మరింతగా వర్షాలతో ముందు జాగ్రత్తలు
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఈనెల 15వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించారు. అప్పటి నుంచి చైన్నెతో పాటు వివిధ ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉత్తర చైన్నెలో వర్షం మొదలైంది. క్రమంగా ఇది నగరమంతా విస్తరించి, రాత్రి 9.30 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం తీవ్ర రూపం దాల్చింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆకాశంలో ఏం జరుగుతున్నదో అన్నట్టుగా ఒక్క సారిగా ఉరుములు, మెరుపుల దాడి చైన్నె నగరం, శివారులలో దద్దరిల్లాయి. కొన్ని గంటల పాటూ ఈ శబ్దంతో పాటూ వర్షం తీవ్రత పెరిగింది. సుమారు నాలుగు గంటల పాటుగా ఎడతెరపి లేకుండా అతి భారీ వర్షం పడింది. దీంతో ఎటు చూసినా రోడ్లుపై వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలలో ఆందోళన నెలకొంది. ప్రధాన రహదారులలో వాహనాలు ఎక్కడిక్కడ ఆగే పరిస్థితి నెలకొంది. చైన్నె శివారులోని కిలాంబాక్కం బస్టాండ్ వరద ముంపులో మునిగినట్టుగా పరిస్థితి మారింది.
క్షేత్రస్థాయి పరిశీలన– సహాయ పనులు
చైన్నెలో ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టడంతో పరిస్థితిని అంచనా వేసేందుకు కార్పొరేషన్ కమిషనర్ జి.ఎస్. సమీరన్ సహా పలువురు ఉన్నతాధికారులు రాత్రంతా కీలక ప్రాంతాలను పర్యవేక్షించారు. ముఖ్యంగా సబ్–వేస్ వద్ద నీరు నిలవకుండా మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపే చర్యలు చేపట్టారు.యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలపై దృష్టి పెట్టారు. సరిగ్గా 5 గంటల సమయంలో వర్షం తగ్గిందో లేదో ఒక్క సారిగా ఐదు వేల మందికి సిబ్బంది రంగంలోకి దిగారు. వందలాది మోటార్లు, ట్రాక్టర్లతో కూడిన మోటారు పంపు సెట్ల ద్వారా రోడ్లపై చేరిన నీటి ఎక్కడిక్కడ తొలగించి వర్షంపు నీటి కాలువలలోకి సజావుగా వె ళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. నగరంలోని మొత్తం 22 సబ్వేలు వర్షపు నీరు నిలవకుండా తొలగించి, ఉదయానికల్లా రాకపోకలను పూర్తిగా పునరుద్ధరించారు. ఉన్నతాధికారులు రాత్రంతా క్షేత్ర సర్వేలు నిర్వహించడం, వర్షపు నీటిని తొలగించే పనులు , సహాయక చర్యలను సీఎం విజయ్ ఆదేశాలతో మంత్రి ఆదవ్ అర్జున, ఇతర అధికారులు సమన్వయం చేశారు. వివిధ స్థాయిలలో 15 వేల మంది సిబ్బంది చైన్నె, శివారులలో సహాయ చర్యలు నర్వహించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఉదయం ఎనిమిది గంట కంతా అన్ని ప్రధాన బస్సు మార్గాల్లో ఉన్న నీటిని తొలగించి వాహనాల రాక పోకలకు మార్గం సుగమం చేశారు. అనంతరం వీధులలో చేరిన నీటి తొలగింపుపై దృష్టి పెట్టి మధ్యాహ్నంలోపు జన జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా ప్రజల భద్రత కోసం 9 సహాయక కేంద్రాలను తెరిచారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆహారం అందించారు.
బ్రాడ్ వేలో 36 సెం.మీ వర్షం
మేఘం బద్దలైందా? అన్నట్టుగా రాత్రంతా పరిస్థితి నెలకొంది. కాగా ఉపరితల ఆవర్తనం కారణంగానే అతి భారీ వర్షం చైన్నెలో కురిసినట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చైన్నెలో 6 చోట్ల అతి భారీ వర్షంగా 20 సె.మీ చొప్పున, 12 చోట్ల అతి భారీ వర్షం 11.5 సెం.మీ కంటే ఎక్కువవర్షం పడినట్టు ప్రకటించారు. బ్రాడ్ వేలో అయితే, బ్రాడ్ వే పరిసరాలలో ఏకగా 36 సెం.మీ వర్షం పడటం గమనార్హం. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయ పరిసరాలలో 28 సెం.మీ వ్షం పడటంతో విమానాల సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విమానా శ్రయం రన్ వేపై పెద్ద ఎత్తున వర్షంపునీరు ప్రవహించడంతో యుద్ద ప్రాతిపదికన తొలగించారు. సుమారు స్వదేశీ, విదేశీ విమానాలు 20కు పైగా సేవలను కొన్ని గంటల ఆలస్యగా సాగించాయి. చైన్నె నగరం, శివారు వ్యాప్తంగా అన్ని చోట్ల 10 సెం.మీకి పైగానే వర్షం పడటం గమనార్హం. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం అన్నది లేదు. ఇదిలా ఉండగా, చైన్నె, శివారు వ్యాప్తంగా మొత్తంగా శనివారం అర్థరాత్రి కొన్ని గంటలలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడ్డప్పటికీ, ఆదివారం అర్థరాత్రి లేదా సోమవారం మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం రెడ్అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప రాత్రులలో బయటికి రావద్దని తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
రంగంలోకి సీఎం విజయ్
రెడ్ అలర్ట్ నేపథ్యంలో సీఎం విజయ్ రంగంలోకి దిగారు. చైన్నెలోని 15 మండలాలకు ఇన్చార్జ్లుగా ఉన్న అధికారులు ఉరకలు తీశారు. వివిధ జిల్లాలో ఉన్నమంత్రులందర్నీ హుటాహుటిన చైన్నెకు రమ్మని ఆదేశించారు. దీంతో ఉత్కంఠ అన్నది బయలుదేరింది. చైన్నె, శివారులలో ముందు జాగ్రత్తలను విస్తృతంచేసే విధంగా చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల అధికారులు సైతం ఉరకలు తీస్తున్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు. సీఎం విజయ్ సాయంత్రం నీలాంకరైలోని నివాసం నుంచి కార్పొరేషన్ భవనం రిప్పన్ బిల్డింగ్కు చేరుకున్నారు. ఇక్కడి చైన్నె కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు ఆయను ముందస్తు ఏర్పాట్లును వివరించారు. అలాగే తాజాగా కురిసిన వర్షంతో రోడ్ల జలమయం, యుద్ధ ప్రాతిపదికన నీటి తొలగింపు, సహాయక పనులను వివరించారు.
ఈశాన్య రుతు పవనాలు వచ్చి రాగానే.. రాజధాని నగరం చైన్నె, శివారు ప్రాంతాలపై శనివారం ప్రతాపం చూపించాయి. ఫలితంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. రోడ్లపై వరదనీరు పోటెత్తింది. ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో వర్షం ఆగిందో లేదో ఒక్క సారిగా వేలాది మంది సిబ్బంది రంగంలోకి దిగడంతో గంటల వ్యవధిలోనే వరదనీటిని రోడ్లపై తొలగించారు. ఫలితంగా ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. మరింత భారీ వర్షాల సమాచారంతో రెడ్ అలర్ట్ జారీ చేసిన యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కాగా సీఎం విజయ్ , మంత్రులు రంగంలోకి దిగి సహాయక పనులను సమీక్షిస్తున్నారు.


