వేలూరు: విద్యను మద్యలో నిలిపి వేసిన వారికి ఉన్నత విద్యను అందజేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని అందరికీ ఉన్నత విద్యా పథకం కింద నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులకు విద్యా స్కాలర్‌షిప్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటి సారిగా వేలూరులో అందరికీ ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ సాయం లేకుండా నిరుపేద విద్యార్థులకు ఉపయోగ పడే విధంగా 2012వ సంవత్సరంలో వీఐటీలో ఒక ట్రస్ట్‌గా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 11,658 మంది విద్యార్థులకు రూ.14.30 కోట్లు స్కాలర్‌షిప్‌లను మరో 925 మందికి రూ. 87.15 లక్షలను అందించామన్నారు. ప్రపంచంలో మొత్తం 193 దేశాలుండగా వాటిలో కేవలం 50 దేశాలు మాత్రమే ఉచిత విద్యను అందిస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 75 శాతం మంది ఉన్నత విద్యకు వెళ్లలేని పరిస్థితిలో ఉండటంతోనే మన దేశం విద్యలో వెనుకంజలోనే ఉందన్నారు. విద్యలో తమిళనాడు మొదటి రాష్ట్రంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మీరందరూ ఉన్నత విద్యా పథకంలో విద్యను అభ్యసించి మీలాంటి నిరుపేద విద్యార్థులకు సాయం అందజేయాలన్నారు. వీఐటీ యూనివర్శిటీలో మొత్తం 43 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని వీరిలో నాలుగు వేల మంది పీహెచ్‌డీ చేస్తున్నారని వీరికి నెలకు రూ. 35 వేలు స్టైఫండ్ ఇస్తున్నామన్నారు.చైన్నెలోని అభిరామి మెగా మాల్ మేనేజింగ్ డైరెక్టర్ అభిరామి రామనాథన్, వీఐటీ యూనివర్సిటీ ఉపాద్యక్షులు శంకర్ విశ్వనాథన్, ఎమ్మెల్యేలు విల్వనాధన్, ఎస్‌ఎం సుకుమార్, సుధాకర్, వినోద్ కన్నన్, కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ మలర్ పాల్గొన్నారు.


