ఆయుధపూజ.. సందడి! | - | Sakshi
Sakshi News home page

ఆయుధపూజ.. సందడి!

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

● కిక్కిరిసిన మార్కెట్లు ● నేడు పండుగ ● స్వస్థలాలకు లక్షలాది మంది ప్రయాణం ● ప్రజలకు నేతల శుభాకాంక్షలు

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఆయుధ పూజ సందడి నెలకొంది. ఆదివారం రాష్ట్రంలోని అన్ని మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. సోమవారం పండుగను పురస్కరించుకుని పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాలలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వరుస సె లవుల నేపథ్యంలో లక్షలాది మంది చైన్నె నుంచి స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఇక, రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ అర్లేకర్‌, సీఎం విజయ్‌తో పాటూ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో పండుగలు అంటే చాలు సంబరాలు అంబరాన్ని తాకుతాయి. వినాయక చవితి తదుపరి వచ్చే పండుగలలో ఆయుధ పూజను అత్యంత వేడుకగా రాష్ట్ర ప్రజలు నిర్వహించడం జరుగుతున్నది. సోమవారం ఆయుధ పూజ, మంగళవారం విజయ దశమి పండుగలను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈసారి పండుగలకు శని, ఆదివారాలు కలిసి రావడంతో నాలుగు రోజులు సెలవు దక్కినట్లయ్యింది. దీంతో చైన్నెలో వివిధ పనులు చేసుకుంటున్న లక్షలాది మంది తమ తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయుధ పూజ వేళ ఇళ్లలో పూజలు చేయడమే కాకుండా, తమ వద్ద ఉన్న వస్తువులు, వాహనాలు, పుస్తకాలు అంటూ తమకు నచ్చిన వాటికి సైతం గౌరవం కల్పించే విధంగా పూజలు చేయడం జరుగుతున్నది. ఇక, పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాల్లో అయితే, కార్మికులను సత్కరించుకునేందుకు సైతం వేడుకలకు ఏర్పాట్లు చేశారు.

మార్కెట్లలో జనం రద్దీ

ఆయుధ పూజ వేల పండ్లు, అరటి గెలలు, పువ్వులు, మరమరాలు, తదితర పూజాసామాగ్రిల కొనుగోలు నిమిత్తం జనం మార్కెట్ల వైపుగా ఆదివారం ఉరకలు తీశారు. వీటి కొనుగోలు నిమిత్తం ప్రత్యేక మార్కెట్లు సైతం ఆయా ప్రాంతాలలో వెలిశాయి. వీటి ధరలకు రెక్కలు వచ్చిన పరిస్థితి ఉన్నా, జనం ఏ మాత్రం తగ్గకుండా తమ స్తోమతకు తగ్గట్టుగా కొనుగోలు చేశారు.

రాజకీయ పక్షాల శుభాకాంక్షలు..

ఆయుధపూజ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తమిళనాడు ప్రజలకు పలు రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ అర్లేకర్‌, సీఎం వజజియ్‌, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, ఏఎంఎంకే జనరల్‌ సెక్రటరీ టీటీవీ దినకరన్‌, తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీకే వాసన్‌, హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కడేశ్వర సుబ్రహ్మణ్యం తదితరులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుధ పూజ, విజయదశమిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గ, లక్ష్మి, సరస్వతీ దేవీల అనుగ్రహంతో విద్య, సంపద, పరాక్రమం సిద్ధిస్తాయని పేర్కొన్నారు. పనియే దైవం, కష్టపడితేనే విజయం అనే సత్యాన్ని గ్రహించి ప్రజలందరూ సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. కష్టపడి పనిచేయడంలోని గొప్పతనాన్ని, జ్ఞాన శక్తిని చాటిచెప్పే ఆయుధ పూజ , చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో అడ్డంకులను తొలగించి, శాంతి, శ్రేయస్సు, ఐక్యతను పెంపొందించాలని కోరారు.

778 ఓమ్ని బస్సులపై రవాణా శాఖ కొరడా..

ఆయుధ పూజ, విజయదశమి సెలవులను ఆసరాగా చేసుకుని ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఓమ్ని బస్సులపై తమిళనాడు రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన ఏకంగా 778 ఓమ్ని బస్సులకు ఆడిట్‌ నివేదికలతో పాటు ఈ–చలాన్‌లను జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పండగ రద్దీ నేపథ్యంలో ప్రైవేట్‌ ఓమ్ని బస్సులు విపరీతంగా ఛార్జీలు పెంచేశాయంటూ ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి విజయ తమిళన్‌ పార్థిబన్‌ ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించారు. ప్రాంతీయ రవాణా అధికారులు , మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఈ విస్తత తనిఖీల్లో పాల్గొన్నారు. 4,233 ఓమ్ని బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఽచార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన 778 బస్సులపై తగిన చర్యలు తీసుకుంటూ ఆడిట్‌ రిపోర్టులు, ఈ–చలాన్లు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement