విద్యార్థులకు విజ్ఞాన కాంతి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు విజ్ఞాన కాంతి

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

న్యూస్‌రీల్‌

కోవైకు ఐకాన్‌గా పెరియార్‌ విజ్ఞాన కేంద్రం

ప్రారంభించిన సీఎం విజయ్‌

విద్యార్థులతో ముచ్చట్లు

పలు పనులకు శంకుస్థాపనలు

క్లాసిక్‌ సిటీలో రోడ్‌ షో

సాక్షి, చైన్నె : కాస్లిక్‌ సిటీ కోయంబత్తూరు(కోవై)కు మరో ఐకాన్‌గా పెరియార్‌ విజ్ఞాన కేంద్రం రూపుదిద్దుకుంది. గాంధీపురంలో రూ.301 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పెరియార్‌ నాలెడ్జ్‌ – సైన్స్‌ సెంటర్‌ను శుక్రవారం సీఎం విజయ్‌ ప్రారంభించారు. లైబ్రరీ, సైన్స్‌ సెంటర్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అక్కడ విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ అంశాలను తిలకించి, విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పలు పూర్తయిన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. సుమారు 100 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ సహాయాన్ని అందజేశారు.

పెరియార్‌ విగ్రహాష్కరణ

విజ్ఞాన కేంద్రం సముదాయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పెరియార్‌ విగ్రహాన్ని సీఎం విజయ్‌ ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మాండ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. తమిళనాడు ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో గాంధీపురం నంజప్ప రోడ్డులో సెంట్రల్‌ బస్‌ స్టాండ్‌కు ఎదురుగా ఉన్న జైళ్ల శాఖ భూమిలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 1.98 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 7 అంతస్తులతో ఈ భవనాన్ని చేపట్టారు. గత డీఎంకే హయంలో 2024లో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు తాజాగా టీవీకే ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి.

కోయంబత్తూరులో అద్భుత నిర్మాణం

కోయంబత్తూరులోని గాంధీపురంలో రూ.301 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా శాసీ్త్రయ నిర్మాణ శైలితో, అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మొత్తం 7 అంతస్తులతో విశాలంగా నిర్మించిన ఈ భారీ సముదాయాన్ని ఏ, బీ అనే రెండు బ్లాకులుగా విభజించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రంథాలయం, 350 మంది కూర్చునే సామర్థ్యం గల అత్యాధునిక ఆడిటోరియం, సైన్స్‌ సెంటర్‌, అంతరిక్షాన్ని అన్వేషించేందుకు ఒక ప్లాంటోరియం, స్పేస్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో రిసెప్షన్‌, సైన్స్‌ సెంటర్‌, దివ్యాంగుల కోసం గ్రంథాలయం ఉన్నాయి. రెండవ అంతస్తులో పాఠకులు స్వయంగా తెచ్చుకునే పుస్తకాలు చదువుకోవడానికి ప్రత్యేక పఠన ప్రదేశం, చిన్నారుల కోసం ప్రత్యేక గ్రంథాలయం ఉన్నాయి. మూడవ అంతస్తులో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం శిక్షణా కేంద్రం, గ్రంథాలయంతో పాటు పరిపాలనా విభాగం ఉంది. నాలుగో అంతస్తులో చరిత్ర పుస్తకాలు, తమిళ పుస్తకాల ప్రత్యేక విభాగాలు, వివిధ పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ఐదవ అంతస్తులో ఆంగ్ల పుస్తకాల విభాగంతో పాటు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే యువత కోసం స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆరవ అంతస్తులో ఆంగ్ల భాషా అభ్యాస విభాగం, మరో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఉన్నాయి. ఏడవ అంతస్తులో విజ్ఞాన వికాసం కోసం సైన్స్‌ సెంటర్‌, ఆధునిక డిజిటల్‌ లైబ్రరీని తీర్చిదిద్దారు. అసమానమైన గ్రంథాలయ వసతులు, శాసీ్త్రయ హంగులు, విజ్ఞాన సర్వస్వంగా రూపుదిద్దుకున్న ఈ పెరియార్‌ విజ్ఞాన కేంద్రం కోయంబత్తూరు ప్రజలకు, విద్యార్థులకు ఒక అద్భుతమైన వరంగా నిలవడమే కాకుండా, క్లాసిక్‌ నగరానికి మరో ఐకాన్‌గా మారింది.

పెరియార్‌ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సీఎం విజయ్‌

సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తున్న సీఎం విజయ్‌

భావితరాల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంతోపాటు అన్వేషణాత్మక ఆలోచలనకు పదును పెట్టే దిశగా తమిళనాడు ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పారిశ్రామిక నగరమైన కోయంబత్తూరులో అత్యాధునిక హంగులతో పెరియార్‌ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించింది. విజ్ఞాన శాస్త్ర వింతలు, ఆధునిక ఆవిష్కరణలను సామాన్యులకు చేరవేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ కేంద్రం కోవై ప్రాంత విద్యార్థులకు విజ్ఞాన గనిగా మారనుంది.

సీఎంకు ఘన స్వాగతం

కోయంబత్తూరు విమానాశ్రయం నుంచి పెరియార్‌ విజ్ఞాన కేంద్రం వరకు సాగిన సీఎం విజయ్‌ ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపులా గుమిగూడిన టీవీకే కార్యకర్తలు, ప్రజలు సీఎం విజయ్‌కు ఘనస్వాగతం పలికారు. దీంతో ఓపెన్‌ టాప్‌ వాహనం నుంచి సుమారు పది కి.మీ దూరం రోడ్‌ షో సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎన్‌.ఆనంద్‌, అధవ్‌ అర్జున, సెంగోట్టయ్యన్‌, రాజ్‌మోహన్‌, సంపత్‌ కుమార్‌, విఘ్నేష్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement