అన్నాడీఎంకే బుడగ కాదు
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే అనేది ఆకర్షణ రాజకీయాలు చేసే బుడగ కాదని, కాలం సైతం నాశనం చేయలేని ఒక గొప్ప ప్రజా ఉద్యమమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. ఆకర్షణ రాజకీయాలు ఒక బుడగ లాంటివి అని, అవి ఎప్పుడైనా పగిలిపోవచ్చని పేర్కొన్నారు. స్పష్టమైన సూత్రాలు, త్యాగాల మీద నిర్మితమైన అన్నాడీఎంకేను ఎవ్వరూ నిర్వీర్యం చేయలేరని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ఆవిర్భవించి శనివారంతో 55 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు శ్రేణులను పళణి స్వామి ఆదేశించారు. బహిరంగ సభలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులకు ఒక ప్రత్యేక లేఖ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం తప్పక గెలుస్తుందని, దుష్ట శక్తులు నశించిపోతాయని, ఎన్ని పరీక్షలు ఎదురైనా విజయాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే ప్రస్థానం – విజయాలు
భారత స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ హవా కొనసాగుతున్న తరుణంలో, అన్నాదురై తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక గొప్ప విప్లవాన్ని తీసుకువచ్చారని పళనిస్వామి గుర్తుచేశారు. ఆ తర్వాత అన్నా ఆదర్శాలను కాపాడేందుకు, కోట్లాది మంది ప్రజల మద్దతుతో 1972 అక్టోబర్ 17న ఎంజీఆర్ అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగంను స్థాపించారని తెలిపారు. 1977లో తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంజీఆర్, జయలలిత హయాంలో అమలైన పోషకాహార పథకం, ఉయ్యాల పథకం, 69 శాతం రిజర్వేషన్కు చట్టపరమైన రక్షణ, అమ్మ క్యాంటీన్లు, విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు వంటి అనేక చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలుచేసినట్టు తెలిపారు. తమ హయాంలో పేద విద్యార్థుల వైద్య విద్య కలలను సాకారం చేయడానికి 7.5 శాతం అంతర్గత రిజర్వేషన్, 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఉమ్మడి తాగునీటి ప్రాజెక్టులు, కుడిమరమత్తు పనులు చేపట్టామని తెలిపారు. నేటి పాలకులు గొప్పగా చెప్పుకుంటున్న మెట్రో రైలు, రోడ్డు విస్తరణ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ తమ హయాంలో ప్రారంభించినవేనని గుర్తుచేశారు.
కుట్రలను ఎదుర్కొంటూ ముందడుగు
పార్టీని నాశనం చేయడానికి ఎంతో మంది శత్రువులు, ద్రోహులు ప్రయత్నించినప్పటికీ కార్యకర్తలు, నాయకుల అచంచలమైన మద్దతుతో అన్ని కుట్రలను తిప్పికొట్టి అన్నాడీఎంకేను గంభీరంగా ముందుకు నడిపించామని పళనిస్వామి పేర్కొన్నారు. తాజాగా జరిగిన 2026 తమిళనాడు శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఆడంబరమైన, ఆకర్షణీయమైన రాజకీయ భ్రమలను ఎదుర్కొంటూనే, అన్నాడీఎంకే కూటమి సుమారు 1.35 కోట్ల ఓట్లను సాధించి 47 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుందన్నారు., దీని ద్వారా పార్టీకి ఉన్న అచంచలమైన ప్రజాదరణ మరోసారి నిరూపితమైందని ఆయన స్పష్టం చేశారు.


