సాక్షి, చైన్నె : ఈశాన్య రుతు పవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తమిళనాడులోని తిరువళ్లూరు, కాంచీపురం సహా 6 జిల్లాల్లో అతి భారీ, డెల్టా సహా 25 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తమిళనాడుపై సుమారు 3.1 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని, దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అలాగే వాయువ్య బంగాళాఖాతం వరకు అల్పపీడనం ఏర్పడిందని, సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తుకు ఆవర్తనం చేరుకుందని తెలిపారు. ఈ కారణంగా శని, ఆదివారాల్లో తమిళనాడులోని నీలగిరి, కోయంబత్తూరు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం రాణిపేట జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చైన్నె, చెంగల్పట్టు, తిరునల్వేలి, కన్యాకుమారి, తేని, దిండిగల్, మదురై, తిరుప్పూర్, వెల్లూరు, కళ్లకురిచ్చి, ఈరోడ్, ధర్మపురి, కృష్ణగిరి, సేలం, రామనాథపురం, తిరుచ్చి, నమక్కల్, కడలూరు, కరూర్, పెరంబలూర్, అరియలూరు, తంజావూరు, డెల్టా జిల్లాల్లోని తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై జిల్లాలు పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో శని, ఆదివారాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మిగిలిన తమిళనాడులో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీన నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం, ఈరోడ్, నామక్కల్, తిరువణ్ణామలై, తిరుప్పూర్, మదురై, దిండిగల్, శివగంగ, ట్రిచి, పుదుక్కోట్టై , కరూర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం, తమిళనాడులోని మిగిలిన చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ పవనాలు క్రమంగా విస్తరిస్తూ మరో ఐదారు రోజులు పుష్కలంగా వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. చైన్నె నగరం, శివారు ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం, అప్పుడప్పుడు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
తేనిలో అలర్ట్
పశ్చిమ కనుమలలోని తెన్కాసి, తేని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి వాగులు, వంకలు కొండ కోనల్లో పొంగి పొర్లుతున్నాయి. కుట్రాలం జలపాతంలో నీటి ఉద్ధృతి పెరగడంతో సందర్శకులను అనుమతించడం లేదు. అత్యధిక వర్షపాతం కన్యాకుమారి జిల్లాలోని అద్యమడైలో 18 సెం.మీ, చిత్రంగోడ్లో 16 సెం.మీ, కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచి, మక్కినంపట్టిలో, తేని జిల్లాలోని పెరియకుళంలో చెరో 15 సెం.మీ. కన్యాకుమారి జిల్లాలోని పొన్మనలో 14 సెం.మీ.గా నమోదైంది. తేని జిల్లాలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కావడంతో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. శని, ఆదవారాలలో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో, జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దు అని జిల్లా కలెక్టర్ శివకృష్ణమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముల్లపెరియార్, కొత్తకుడి, వరాహ నది, వైగై నదులలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున, ప్రజలు నదులలో స్నానం చేయడానికి వెళ్లవద్దని హెచ్చరించారు. జలపాతాల వద్దకు వెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. రైతులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని సూచించారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 43 ప్రదేశాలను ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించారు. తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


