ఎం.కె. స్టాలిన్
సాక్షి, చైన్నె: ‘‘ప్రారంభించడంలో ఎలాంటి గొప్పతనం లేదు. ప్రణాళికాబద్ధంగా, అత్యంత సునిర్వచితంగా దేన్నైనా సృష్టించడమే అసలైన గర్వకారణం! తమిళనాడులో ఆ సృజనాత్మక శక్తి డీఎంకేకే దక్కుతుంది’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో పెరియార్ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ద్రావిడ ఆదర్శ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మరో చారిత్రాత్మక ప్రాజెక్టు ప్రజలకు అంకితం కావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. 2024–25 బడ్జెట్ హామీ మేరకు కోయంబత్తూరు సెంట్రల్ జైలు స్థలంలో 1.98 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 7 అంతస్తులతో రూ.300 కోట్ల భారీ వ్యయంతో ఈ జ్ఞాన మందిరాన్ని అత్యంత వేగంగా నిర్మించామన్నారు. గతంలో కరుణానిధి శతజయంతి కానుకగా మదురైలో కలైంజ్ఞర్ శతజయంతి గ్రంథాలయం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. చైన్నెలోని చారిత్రాత్మక కన్నెమర గ్రంథాలయం, మరో గ్రంథాలయాన్ని కూడా అత్యాధునిక వసతులతో పునరుద్ధరించినట్లు తెలిపారు. చైన్నె, మదురై తర్వాత పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కోయంబత్తూరులో ఈ పెరియార్ విజ్ఞాన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఘనత డీఎంకేదే అని స్పష్టం చేశారు.
పోలీసులకు అత్యాధునిక యాంటీ డ్రోన్ గన్స్
సాక్షి, చైన్నె: అనుమతి లేకుండా గగనతలంలో తిరిగే మానవరహిత వాహనాలను (డ్రోన్లను) క్షణాల్లో గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు తమిళనాడు పోలీస్ శాఖ సన్నాహాలు చేపట్టింది. పోలీసుల సామర్థ్యాన్ని, భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలీస్ విభాగానికి అత్యాధునిక డ్రోన్ నిరోధక తుపాకులను అందజేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఇతర ప్రముఖుల పర్యటనల సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు అత్యాధునిక పరికరాల కొనుగోలుపై అధికారిక టెండర్‌ను జారీ చేశారు. సులభంగా ఎక్కడికై నా తీసుకెళ్లగలిగే పరికరాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందులో పరిమితికి లోబడి గగన తలంలోకి ప్రవేశించే అనుమానాస్పద డ్రోన్లను గుర్తించి, 10 సెకన్ల వ్యవధిలోనే వాటి కంట్రోల్ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించలేని విధంగా కట్ చేయగలిగే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాలను ప్రసారం చేయడం ద్వారా డ్రోన్‌ను దాని ఆపరేటర్ కంట్రోల్ సెంటర్ నుంచి వేరు చేస్తుంది. సిగ్నల్ కట్ అయిన వెంటనే ఆ డ్రోన్ పనిచేస్తున్న ప్రదేశానికి తిరిగి వెళ్లడం లేదా ఉన్నఫళంగా సురక్షితంగా కిందకు ల్యాండ్ అయ్యేలా చేస్తుంది. భారీ బహిరంగ సభలు, ప్రముఖుల పర్యటనలు, పండుగలు, ఆధ్యాత్మిక యాత్రలు, ఉత్సవాల సమయంలో వైమానిక ముప్పులను అడ్డుకోవడానికి ఈ అత్యాధునిక ఆయుధాలు తమిళనాడు పోలీసులకు ఎంతో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.
రోడ్డెక్కిన ప్రత్యేక బస్సులు
సాక్షి, చైన్నె : ఆయుధ పూజ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దీంతో చైన్నె నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. రెండు నెలల ముందే రైళ్లు బుక్ చేసుకున్నప్పటికీ సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లన్నీ కిటకిటలాడుతుండడంతో ప్రజలు ప్రభుత్వ బస్సులపై ఆధారపడుతున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా శాఖ చర్యలు తీసుకుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఒక్క రోజే చైన్నె నుంచి వివిధ ప్రాంతాలకు రెండు వేల ప్రత్యేక బస్సులను నడిపారు. కిలాంబాక్కం బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, బస్సుల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో ప్రజలు ప్రయాణ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, బస్సుల లభ్యత వివరాలను ఎప్పటికప్పుడు గమనించాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. ప్రైవేటు ఆమ్నీ బస్సుల్లో చార్జీల దోపిడీ పెరిగినట్టు ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైళ్లు సైతం కిక్కిరిసి ఉన్నాయి. అన్ రిజర్వుడ్ బోగీల వద్ద పోలీసులు ప్రయాణికులను క్యూలో నిలబెట్టి జాగ్రత్తగా రైల్లోకి ఎక్కిస్తున్నారు.


