సాక్షి,చైన్నె : అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే.పళనిస్వామి నాయకత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న సీనియర్ నేత సి.వి.షణ్ముగంకు చెందిన సుమారు 100 మంది మద్దతుదారులను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ అధిష్టానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంపై పార్టీలో అసంతృప్తి చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఓటముల నేపథ్యంలో మాజీ మంత్రులు సి.వి.షణ్ముగం, ఎస్.పి.వేలుమణి వంటి సీనియర్ నేతలు పార్టీ నాయకత్వ శైలిని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేయడం, బహిరంగంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా సి.వి.షణ్ముగం పార్టీలో సర్వసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని, కార్యకర్తల అభిప్రాయాలు వినడానికి ప్రత్యేక కమిటీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
పార్టీలో ముదురుతున్న సంక్షోభం
తాజాగా సి.వి.షణ్ముగం మద్దతుదారులను పెద్ద ఎత్తున పదవుల నుంచి తొలగించడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విల్లుపురం, కళ్లకురిచ్చి తదితర జిల్లాల స్థాయిలో బలమైన పట్టున్న సి.వి. షణ్ముగం వర్గాన్ని టార్గెట్ చేయడం ద్వారా నాయకత్వం తన పట్టును మరింత బిగించుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీవీ షణ్ముగం మద్దతు దారులు వందమందిని ఏకంగా పార్టీ పదవుల నుంచి పళణి స్వామి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సి.వి.షణ్ముగం భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటారు? లేదా నాయకత్వంతో ఈ విభేదాలు మరింతగా ముదిరేనా? లేక పార్టీలో చీలికలకు దారితీస్తుందా? అన్న చర్చ ఊపందుకుంది.
సీవీ షణ్ముగంపై పళణి కన్నెర్ర


