క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

స్మార్ట్‌ యాప్‌ ఆవిష్కరణ ఆటో డ్రైవర్ల ఆందోళన రూ.400 కోట్ల టర్మోవర్‌ లక్ష్యం విద్యుత్‌ వినియోగాన్ని ట్రాక్‌ చేయడానికి కొత్త యాప్‌ న్యాయవాది హత్య

సాక్షి, చైన్నె: స్మార్ట్‌ టీవీల్లో ఎలాంటి కేబుల్స్‌, సెట్‌–టాప్‌ బాక్సులు, డిష్‌ యాంటెన్నాలతో సంబంధం లేకుండా నేరుగా లైవ్‌ టీవీ అనుభవాన్ని అందించేందుకు ప్రముఖ సంస్థ టాటా ప్లే సరికొత్తగా టాటా ప్లే స్మార్ట్‌ టెలివిజన్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ను ఆవిష్కరించింది. దీనికి ప్రచారకర్తగా జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు రాజ్‌కుమార్‌ రావు వ్యవహరిస్తున్నారని టాటా ప్లే ఎండీ – సీఈఓ హరిత్‌ నాగ్పాల్‌ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, ఈ యాప్‌ ద్వారా ఎలాంటి సెట్‌–టాప్‌ బాక్స్‌ లేదా వైర్లు లేకుండానే 500కు పైగా లైవ్‌ టీవీ ఛానెళ్లను వీక్షించవచ్చని వివరించారు. డీటీహెచ్‌ సర్వీస్‌ను పోలినట్లుగానే ఛానెల్‌ నంబర్లు, ప్రోగ్రామ్‌ గైడ్‌, రిమోట్‌ కంట్రోల్‌ సదుపాయాలతో ఇది పెద్ద స్క్రీన్‌పై పనిచేస్తుందని తెలిపారు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఏ స్మార్ట్‌ టీవీలోనైనా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించారు. అర్బన్‌ ప్రాంతాల్లో వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వాడుతున్న గృహాల ఇన్ఫోటైన్‌మెంట్‌ అవసరాలను తీర్చడానికి ఈ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు.

వేలూరు: ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశ పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పో యి కుటుంబాలను పోషించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఒడుగత్తూరు ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సుల పథకాన్ని ప్రస్తుతం అమలు చేయడంతో ఆటోల వైపు ఎవరూ చూడడం లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. తాము అష్టకష్టాలు పడి ఆటోలను కొనుగోలు చేశామని, ప్రతి రోజూ ఆటోలు నడుపుతూ ఫైనాన్స్‌ చెల్లించడంతో పాటు తాము తీసుకున్న రుణాలను బ్యాంకులకు ప్రతినెలా చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం తరహాలో ఆటో కార్మికులకు సంవత్సరానికి ఒకసారి రూ.16 వేలు చెల్లించాలని, తమ జీవనోపాధిని కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో వివిధ ఆటో డ్రైవర్ల సంఘాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

సాక్షి, చైన్నె: ఫన్‌ స్కూల్‌ ఇండియా తన భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్టు ఆ సంస్థ సీఈఓ కె.ఏ.షబ్బీర్‌ తెలిపారు. ఆయన గురువారం కొత్త ఉత్పత్తులను స్థానికంగా పరిచయం చేశారు. ఆయన మాట్లాడుతూ లైసెన్సింగ్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ ఒప్పందాలతో పిల్లలకు అత్యుత్తమ ఆట వస్తువులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లకు పైగా టర్నోవర్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.329 కోట్ల టర్నోవర్‌ సాధించామన్నారు. గత ఆరేళ్లలో గోవా, తమిళనాడులోని రాణిపేటలోని తమ తయారీ కేంద్రాల విస్తరణ కోసం సుమారు రూ.149 కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. తమ పరిశ్రమలో 70 శాతం మందికి పైగా మహిళా ఉద్యోగులే ఉన్నారని వివరించారు.

కొరుక్కుపేట: విద్యుత్‌ వినియోగం, బిల్లులను ట్రాక్‌ చేయడానికి వీలుగా తమిళనాడు విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థ ఒక కొత్త మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పెరుగుతున్న విద్యుత్‌ బిల్లులు, అధిక విద్యుత్‌ వినియోగంపై వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ మీటరింగ్‌ పథకం కింద ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా వినియోగదారులు తమ విద్యుత్‌ వినియోగాన్ని, ఖర్చులను గంట, రోజు, వారం, నెల, ఏడాది వారిగా తెలుసుకోవచ్చు. బిల్లుల చెల్లింపు, విద్యుత్‌ బిల్లులను రిపోర్ట్‌ చేయడం, కొత్త కనెక్షన్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రజలు దీన్ని ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌ల ద్వారా ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని కొండసముద్రంలో న్యాయవాది హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కదిరవన్‌(40) వేలూరులోని ఒక ప్రయివేటు కంపెనీలో పని చేయడంతో పాటు న్యాయవాదిగాను పనిచేస్తున్నాడు. ఇతనికి ఇంకా వివాహం జరగలేదు. అదే గ్రామంలో వివాహమై భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న నక్షత్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరు ఇద్దరూ కొన్ని రోజులు ఒకే ఇంటిలో సహజీవనంచేశారు. కొద్ది రోజులుగా కదిరవన్‌ తన ప్రియురాలితో మాట్లాడడం మానేశాడు. దీంతో నక్షత్రకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి బుధవారం సాయంత్రం అక్క అముదతో పాటు ఆమె కుమార్తెలు ప్రభావతి, లక్ష్మితో కలిసి కదిరవన్‌ ఇంటికి వెళ్లారు. అతనితో గొడవకు దిగి దాడి చేశారు. స్పృహ తప్పి కింద పడిన అతన్ని స్థానికులు గుడియాత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గుడియాత్తం పోలీసులు హత్య కేసు నమోదు చేసి నక్షత్ర, అముద, ప్రభావతి, లక్ష్మిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement