సాక్షి, చైన్నె:చైన్నెలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ని ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ స్కూల్ నుండి రక్షణ దళాలకు చెందిన 54 మంది పైలట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. శనివారం జరిగిన ఈ స్నాతకోత్సవ వేడుకకు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ ఎయిర్ మార్షల్ జార్జ్ థామస్ ముఖ్య అతిథిగా హాజరై గ్రాడ్యుయేట్లను అభినందించారు. 161వ బ్యాచ్‌గా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ కోర్స్ కింద ఈ శిక్షణ అందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో భారత వైమానిక దళానికి చెందిన 42 మంది, భారత నావికాదళానికి చెందిన ఏడుగురు, భారత సైన్యం నుంచి ముగ్గురు, కోస్ట్ గార్డ్ నుండి ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరితో పాటు స్నేహపూర్వక విదేశాల నుండి వచ్చిన ముగ్గురు పైలట్లు కూడా ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభమైన ఈ కోర్సు... 24 వారాల పాటు అత్యంత కఠినంగా సాగింది. ఇందులో 10 దశల ఫ్లయింగ్ శిక్షణ , 200 గంటలకు పైగా గ్రౌండ్ ట్రైనింగ్ అందించారు.
ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు
శిక్షణలో అద్భుత ప్రతిభ కనబరిచిన అధికారులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. ఇందులో మజిథియా ట్రోఫీ (మొత్తం మెరిట్‌లో ప్రథమం)– స్క్వాడ్రన్ లీడర్ బోపన్న ఎ.ఎ. , అర్జన్ సింగ్ ట్రోఫీ (ఫిక్స్డ్ వింగ్ ఫ్లయింగ్‌లో బెస్ట్)– స్క్వాడ్రన్ లీడర్ శివ్‌కుమార్ భట్కరే ,అర్జన్ సింగ్ ట్రోఫీ (రోటరీ వింగ్ ఫ్లయింగ్‌లో బెస్ట్)– స్క్వాడ్రన్ లీడర్ సౌమ్య శర్మ , నిర్మల్ జీత్ సింగ్ సెఖోన్ ట్రోఫీ (ఏరోబాటిక్స్‌లో ప్రథమం)– స్క్వాడ్రన్ లీడర్ బిజో ఆంటన్ ), దిల్బాగ్ ట్రోఫీ (ఇన్‌స్ట్రక్షనల్ టెక్నిక్‌లో ప్రథమం)– లెఫ్టినెంట్ కమాండర్ పార్థ్ దేశ్‌పాండే , సుబ్రతో ముఖర్జీ ట్రోఫీ (గ్రౌండ్ సబ్జెక్ట్స్‌లో ప్రథమం)– స్క్వాడ్రన్ లీడర్ అమోల్ గార్గ్ , మెహర్ సింగ్ ట్రోఫీ (మొత్తం మెరిట్‌లో ద్వితీయ స్థానం)– స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ... కొత్తగా శిక్షణ పొందిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు భవిష్యత్తులో తాము శిక్షణనిచ్చే అభ్యర్థులను అత్యంత ఆత్మవిశ్వాసంతో, దేశసేవకు పూర్తిస్థాయిలో సిద్ధమైన పైలట్లుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.


